హైదరాబాద్‌లో బంగారం ధర ఎంతంటే? సెప్టెంబర్ నాటికి రూ.10,000 తగ్గేనా?
నాలుగు రోజుల పాటు తగ్గిన పసిడి ధరలు నిన్న మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.700కు పైగా పెరిగి రూ.53,700 పలికింది. డాలర్ మారకంతో రూపాయి పడిపోవడంతో ధరలు పెరిగాయి. వెండి ధర కూడా రూ.1,500 పెరిగింది. రూ.70,000కు పైగా పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మాత్రం తగ్గుతున్నాయి. దేశీయ మార్కెట్లో నిన్న పెరిగాయి.

హైదరాబాద్‌లో రెండో రోజు పెరిగిన ధరలు
ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.51,000 పైకి చేరుకుంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.55,760 పలికింది. నిన్న, ఈ రోజు ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి శుక్రవారం కంటే రూ.50 తగ్గుదలను నమోదు చేసింది.

భారీగా తగ్గి.. స్వల్పంగా పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మంగళవారం ఓ సమయంలో ఔన్స్ ధర 1,912కు పడిపోయాయి. అంతకుముందు ధర కంటే ఏకంగా 5.7 శాతం క్షీణించింది. ఆ రోజు నుండి ధరల పెరుగుదల, తరుగుదలలతో 1.8 శాతం రికవరీ అయి 1,947 డాలర్లకు చేరుకుంది. ఇండియన్ మార్కెట్ ధర ప్రకారం రూ.52,700 వరకు ఉంటుంది. అయినప్పటికీ గత వారం రూ.2,070కి పైగా ధరతో పోలిస్తే భారీగా తగ్గింది.

సెప్టెంబర్ చివరి నాటికి 1,660 డాలర్లకు తగ్గవచ్చు
బంగారం ధరలు సెప్టెంబర్ చివరి నాటికి ఔన్స్ 1,660 డాలర్లకు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ మార్కెట్ ప్రకారం రూ.45వేలకు అటు అటుగా ఉంటుంది. కరోనా మహమ్మారి తగ్గుదల, ఇప్పటికే రష్యా వ్యాక్సీన్ రాక, అది క్రమంగా ప్రజలందరికీ అందుబాటులోకి రావడం, మరిన్ని దేశాల వ్యాక్సీన్ల రాక, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో కోలుకోవడం వంటి వివిధ కారణాలతో పసిడిపై ఒత్తిడి తగ్గవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications