Gold prices: భారీగా పెరిగిన బంగారం ధర, రూ.54,000 దిశగా వెళ్తాయా.. కొనుగోలు చేయవచ్చా?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మాస్కో పైన అమెరికా, యూరోప్ దేశాల ఆంక్షల నేపథ్యంలో బంగారం ధరలు పరుగులు పెట్టాయి. గతవారం అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1975 డాలర్లను టచ్ చేసి, 2000 డాలర్ల దిశగా కనిపించింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.53,000 దిశగా పరుగు పెడుతోంది. అంతర్జాతీయ పరిణామాలు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

బంగారం ధరలు
క్రితం సెషన్‌లో (మార్చి 4) ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.779 పెరిగి రూ.52,549 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1042 పెరిగి రూ.52,991 వద్ద ముగిసింది. మొన్నటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,800 నుండి రూ.52,601 స్థాయిలో కదలాడింది. మే సిల్వర్ ఫ్యూచజర్స్ రూ.1269 పెరిగి రూ.69,173 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1203 పెరిగి రూ.69,785 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏడాది తర్వాత రూ.70,000 స్థాయికి వెళ్లింది.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1975 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం ఒక్క సెషన్‌లోనే 38.40 డాలర్లు లేదా 2 శాతం పెరిగింది. నిన్నటి సెషన్‌లో 1,932.30 - 1,974.90 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.686 (2.72%) డాలర్లు లాభపడి 25.898 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ కూడా చాలా నెలల తర్వాత 26 డాలర్ల స్థాయికి చేరుకుంది.

ఇప్పుడు కొనుగోలు చేయాలా అంటే?
బంగారం ధరలు మే 2021 తర్వాత ఓ వారంలో అత్యంత గరిష్టంగా లాభపడ్డాయి. ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పుడు రూ.52,500 పైన ఉన్న పసిడి ధరలు సమీప భవిష్యత్తులో రూ.54,000కు కూడా చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇందుకు వివిధ అంశాలు జత కానున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఈ ప్రభావంతో అంతర్జాతీయ ద్రవ్యోల్భణ భయాలు, ఎగుమతులు, దిగుమతుల దెబ్బకు తోడు డాలర్ మారకంతో రూపాయి క్షీణత కారణంగా పసిడి ధరలు 54,000 క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అయితే యుద్ధం పరిస్థితి సమసిపోతే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications