డొమెస్టిక్ మార్కెట్లో బంగారం, వెండి ప్యూచర్ ధరలు నిన్న తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, డాలర్ బలపడటంతో పసిడిపై ఒత్తిడి తగ్గింది. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ అక్టోబర్ 5 డెలివరీ 0.83 శాతం లేదా రూ.425 తగ్గి రూ.50,928 వద్ద క్లోజ్ అయింది. సెషన్‌లో ఓ సమయంలో రూ.50,914కు కూడా దిగి వచ్చింది. ఎంసీఎక్స్ డిసెంబర్ 4 సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.67,410 సెటిల్ అయింది. సెషన్‌లో ఓసమయంలో రూ.67,351కు దిగి వచ్చింది. మొత్తంగా రూ.1,084 తగ్గింది.

స్పాట్ గోల్డ్ రూ.51,051
బంగారం ధరలు ఆగస్ట్ 7వ తేదీ రికార్డ్‌స్థాయిలో 10 గ్రాములు రూ.56,200కు పైన పలికింది. నాటితో ఇప్పటికీ రూ.5వేలకు పైగా తక్కువగా ఉంది. గత నెల గరిష్ట ధర నుండి కిలో వెండి రూ.11వేల వరకు తక్కువగా ఉంది. స్పాట్ గోల్డ్ విషయానికి వస్తే బుధవారం 10 గ్రాములు రూ.51,051 పలికింది. సిల్వర్ కిలో రూ.64,547 పలికింది. వీటికి జీఎస్టీ అదనం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 0.80 శాతం తగ్గి ఔన్స్ 1,927.70 డాలర్లు పలికింది. న్యూయార్క్ మర్చంట్ ఎక్స్చేంజ్ కామెక్స్‌లో వారం కనిష్టానికి చేరుకుంది. ఇక వెండి ధర 1.37 శాతం క్షీణించి ఔన్స్ 26.62 డాలర్లు పలికింది.

అందుకే దిశలేని వాణిజ్యం..
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఆరు నెలల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే నెల రోజుల క్రితం రష్యా వ్యాక్సీన్ రావడంతో తగ్గుముఖం పట్టాయి. దీంతో రికార్డ్ స్థాయి ధర నుండి ఏకంగా రూ.5వేలకు పైనా తగ్గుముఖం పట్టింది. నాటి నుండి రూ.51వేల లోపు నుండి రూ.52వేల వరకు తచ్చాడుతోంది. కరోనా నేపథ్యంలో దీర్ఘకాల దృక్పథంలో బంగారం ర్యాలీ ఉంటుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. వివిధ కారణాల వల్ల పసిడి దిశలేని వాణిజ్యానికి దారి తీసిందని, అందుకే నెల క్రితం వరకు వేగంగా పెరిగాయని, సమీప కాలంలోను ఇది కొనసాగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

బంగారం అస్థిరంగా ఉండవచ్చు..
బంగారం అస్థిరంగా ఉండవచ్చునని, కానీ పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితుల మధ్య కొనుగోలు తక్కువస్థాయికి పడిపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, అమెరికా డాలర్ ప్రభావం ప్రధానంగా కొనసాగుతుందని చెబుతున్నారు. ఏమయినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో బంగారం ఇన్వెస్టర్లకు సురక్షిత పెట్టుబడి అంటున్నారు.

నిన్న తగ్గి, నేడు పెరిగిన బంగారం ధరలు
నిన్నటి వరకు తగ్గిన పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో బంగారం రూ.250 వరకు పెరిగి 24 క్యారెట్ల పసిడి రూ.53,550, 22 క్యారెట్ల పసిడి రూ.49,100 పలికింది. ఢిల్లీ మార్కెట్లో రూ.300 వరకు పెరిగి 24 క్యారెట్ల పసిడి రూ.54,600, 22 క్యారెట్ల పసిడి రూ.50,050 పలికింది. వెండి కిలో రూ.100 తగ్గింది.


Click it and Unblock the Notifications