అక్టోబర్‌లో మారే 8 మనీ రూల్స్ ఇవే.. మీ జీతంపై ప్రభావం పడకుండా ముందే అలర్ట్ అవ్వండి..
Financial Rules Change: దేశంలో రాబోయే అక్టోబర్ నెల సామాన్య ప్రజల నుండి వ్యాపారుల వరకు అందరి ఆర్థిక వ్యవహారాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. బ్యాంకింగ్ ఛార్జీల మార్పులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనలు, చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల సమీక్ష, ఐటీఆర్ గడువులతో పాటు పండుగ సీజన్‌లో నిత్యావసర ఎలక్ట్రానిక్స్ మరియు మోటార్ వాహనాల ధరల పెంపు వరకు అనేక అంశాలు ప్రజల బడ్జెట్‌ను పునఃసమీక్షించుకునేలా చేస్తున్నాయి.
బ్యాంకింగ్ రంగానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన శాలరీ ప్యాకేజ్ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటిఎంల ద్వారా ఉచితంగా పొందే లావాదేవీల పరిమితిని తగ్గించింది. గతంలో నెలకు పది ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉండగా, అక్టోబర్ మొదటి తేదీ నుండి ఇతర బ్యాంకుల ఏటిఎమ్‌లలో నెలకు ఐదు లావాదేవీలను మాత్రమే ఉచితంగా అనుమతిస్తారు. పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి ఆర్థిక లావాదేవీకి ₹23 తో పాటు జీఎస్‌టీ, ఆర్థికేతర లావాదేవీలకు ₹11 తో పాటు జీఎస్‌టీ చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి.

అలాగే ఎస్‌బిఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు నెలకు మొదటి నాలుగు నగదు ఉపసంహరణలు ఉచితంగా లభిస్తాయి. ఐదో ఉపసంహరణ నుండి ప్రతి లావాదేవీకి రూ. 15 ప్లస్ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము లెక్కింపులో ఆధార్ ఆధారిత చెల్లింపుల ఉపసంహరణలు కూడా చేర్చబడినప్పటికీ.. డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన కొత్త మార్గదర్శకాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. మూడు కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు అదనపు నిబంధనల వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సాధారణ రిటైల్ ఖాతాదారుల డిపాజిట్ రేట్లపై తక్షణ ప్రభావం ఉండకపోయినప్పటికీ, బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా రేట్లను నిర్ణయించనున్నాయి.
దీనితో పాటు పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ల వడ్డీ రేట్లను అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి కేంద్ర ప్రభుత్వం సమీక్షించనుంది. అటు ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ అక్టోబర్ 5 నుండి 7 వరకు సమావేశమై కీలకమైన రెపో రేటుపై నిర్ణయాన్ని వెల్లడించనుంది.
ఇతర సేవలకు వస్తే గృహ వినియోగ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ల పొందేందుకు ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ ధృవీకరణ తప్పనిసరి కానుంది. విదేశీ భారతీయుల (ఎన్నారై) నుండి ఆస్తులను కొనుగోలు చేసే వ్యాపార లావాదేవీలలో 'టాన్' అవసరం లేకుండా కేవలం 'పాన్' కార్డ్‌తోనే పన్ను మినహాయింపు ప్రక్రియలను పూర్తి చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. మరోవైపు పన్ను ఆడిట్ పరిధిలోకి వచ్చే వర్తకులు తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి అక్టోబర్ 31 తుది గడువుగా నిర్ణయించబడింది.
పండుగ సీజన్‌లో కొత్త వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల భారం తప్పకపోవచ్చు. ఉక్కు, అల్యూమినియం, రాగి వంటి ముడి పదార్థాల ధరలతో పాటు రవాణా వ్యయం పెరగడంతో మారుతి, టాటా, హ్యుందాయ్ కంపెనీలు తమ ప్రముఖ మోడళ్ల ధరలను పెంచాయి. ఎయిర్ కండీషనర్ల ధరలు 5 నుండి 8 శాతం వరకు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషీన్ల ధరలు 3 నుండి 4 శాతం వరకు ప్రియం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications

