ముంబై: నల్లధనాన్ని నియంత్రించడం, మరికొంత మందిని పన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకొచ్చే చర్యలో భాగంగా పాన్‌కార్డును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. రూ.50 వేలకు మించి లావాదేవీలు దాటితే బ్యాంకుల్లో పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్)ను తప్పనిసరిగా రాయాలని పేర్కొంది.
పాన్ నెంబర్ ఇవ్వకపోయినా, తప్పుడు ధృవీకరణ ఇచ్చినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, భారీగా జరిమానా విధించే నిబంధనను జనవరి 1 (శుక్రవారం) నుంచి అమలులోకి తీసుకొచ్చింది. నిబంధనల ప్రకారం పాన్ నమోదు తప్పనిసరి అయిన లావాదేవీ నిర్వహిస్తున్న వ్యక్తికి పాన్ లేకపోతే, ఫామ్ నెంబర్ 60ని తప్పనిసరిగా నింపాల్సి ఉంటుందని ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు తెలిపారు.
ఫారం 60లో పేరు, చిరునామా, పుట్టినరోజు, మొబైల్ నెంబరు వంటి వ్యక్తిగత వివరాలు పూరించి, ఆధార్, ఫోటో ఓటర్ కార్డు వంటి వ్యక్తిగత, నివాస ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. లావాదేవీ నగదు, చెక్కు, కార్డు, డ్రాఫ్ట్, బ్యాంకర్ చెక్, ఆన్‌లైన్ లావాదేవీలు ఇలా ఏ పద్ధతిలో చేశారో నమోదు చేయాలి.

దీంతో పాటు లావాదేవీలు నిర్వహించిన వ్యక్తి వార్షిక వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయం కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఫారంలో తప్పుడు వివరాలు సమర్పిస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 277 ప్రకారం విచారణ జరిపి కనీసం మూడు నెలల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
ఏయే లావాదేవీలకు పాన్ కార్డు లేదా ఫారం 60 తప్పనిసరి అంటే:
* ఒక ఏడాది వ్యవధిలో జీవితబీమా ప్రీమియం కోసం రూ.50,000 చెల్లిస్తుంటే
* రూ. 2 లక్షలకు మించిన విలువైన బంగారు ఆభరణాలను నగదు లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే
* రూ. 10లక్షలకు మించి విలువైన స్థిరాస్తి కొనుగోలు చేస్తే
* హోటల్ బిల్లు, విదేశీ ప్రయాణ టికెట్ల కొనుగోలుకు నగదు రూపంలో రూ.50,000కు మించి చెల్లించడం
* స్టాక్‌ఎక్స్ఛేంజీలలో నమోదైన కంపెనీల షేర్లు రూ.50,000, అంతకుమించి విలువైనవి కొనుగోలు చేస్తే
* బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలలో ఒకసారి రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తే
* బ్యాంకు డ్రాఫ్ట్, పేఆర్డరు, బ్యాంకర్స్ చెక్ వంటివి కొనుగోలుకు ఒకరోజులో రూ.50,000కు మించి చెల్లిస్తే
* రూ.50,000 మించిన క్యాష్ లేదా ప్రీపెయిడ్ కార్డుల కోసం నగదు చెల్లించడం
ఈరోజు నుంచి బ్యాంకు ఖాతా ఓపెన్ చేసేందుకు కూడా పాన్ కార్డుని తప్పనిసరి చేశారు. అయితే ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద ప్రారంభించే ఖాతాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.


Click it and Unblock the Notifications