న్యూఢిల్లీ: నూతన ఆర్ధిక సంవత్సరం 2015-16లో చిన్నమొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో చేసే డిపాజిట్లపై వడ్డీరేటును ప్రభుత్వం 9.2 శాతంగా నిర్ణయించింది.
ప్రస్తుతం ఈ ఖాతాలపై 9.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకం కింద 10 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు పేరు మీద పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వారికి 14 సంవత్సరాలు నిండే వరకు సొమ్ము జమ చేయవచ్చు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకం వడ్డీ రేటును ప్రస్తుత 9.2 శాతం నుంచి 9.3 శాతానికి పెంచారు. ఇక పిపిఎఫ్ ఖాతాలు, కిసాన్ వికాస్ పత్రాలపై 2015-16 సంవత్సరానికి వడ్డీరేటును 8.7 శాతంగా యథాతథంగా కొనసాగిస్తున్నారు.