Jaahnavi Kandula: కర్నూలు విద్యార్దిని చావుకు అమెరికా రూ.262 కోట్ల పరిహారం..!
అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కర్నూలు విద్యార్ధిని కందుల జాహ్నవి (jaahnavi kandula) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కుమార్తె చావుకు పోలీసులు కారణమైనందున అమెరికా చట్టాల ప్రకారం భారీ పరిహారం చెల్లించాలని ఆమె తల్లితండ్రులు చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది.
2021లో అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన కర్నూలు విద్యార్ధిని కందుల జాహ్నవి.. 2023 జనవరి 23న సియాటిల్ లో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన జాహ్నవి అక్కడికక్కడే చనిపోయింది. అదే సమయంలో వాహనం నడిపిన పోలీసు అధికారి కెవిన్ డవే.. ఆమె ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువలేదంటూ చౌకబారు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదంతా ఆయన బాడీ కెమెరాలోనే రికార్డ్ అయింది.

ఆ వ్యాఖ్యలపై భారత్ కూడా నిరసన తెలిపింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరిపిన సియాటిల్ పోలీసులు.. సదరు అధికారిని విధుల నుంచి తప్పించారు. 40 కిలోమీటర్ల వేగం అనుమతి ఉన్న రోడ్డుపై 119 కిలోమీటర్ల వేగంతో వచ్చి జాహ్నవిని అతని వాహనం ఢీకొట్టినట్లు గుర్తించారు. దీంతో ఆమె తల్లితండ్రులు న్యాయపోరాటం చేశారు. చివరికి దిగొచ్చిన సియాటెల్ ప్రభుత్వం.. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించి కేసు సెటిల్ చేసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సెటిల్మెంట్ తో ఆమె కుటుంబానికి కాస్తయినా ఉపశమనం దక్కుతుందని స్థానిక అటార్నీ ఈ ప్రకటనలో తెలిపారు.
Credit: Oneindia


Click it and Unblock the Notifications