ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం: ఐక్యరాజ్య సమితి, భారత్-చైనాలకు మాత్రం ఊరట!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందని ఐక్య రాజ్య సమితి మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతాయని అంచనా వేసింది. ఆర్థిక మాంద్యం విషయంలో చైనా, భారత్‌లకు మాత్రం ఊరట దక్కుతుందని అభిప్రాయపడింది.

మాంద్యం నుండి భారత్, చైనా మినహాయింపు
చైనా మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐక్య రాజ్య సమితి హెచ్చరించింది. భారత్‌లో కూడా మాంద్యం ఉండకపోవచ్చునని తెలిపింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (UNCTAD) ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా అబివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉందని తెలిపింది. వీరు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది.

రూ.2.5 లక్షల కోట్ల డాలర్ల కరోనా ఆర్థిక ప్యాకేజీ
ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2.5 లక్షల కోట్ల డాలర్ల కరోనా ఆర్థిక ప్యాకేజీ అవసరమని తెలిపింది. ఈ దేశాలు రెండు నుండి మూడు లక్షల కోట్ల డాలర్ల విదేశఈ పెట్టుబడులను సైతం కోల్పోనున్నాయని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్తోందని, ఈ ప్రభావం భారీగానే ఉంటుందని పేర్కొంది. ఈ మాంద్యం ప్రభావం చైనా, భారత్ పైన మాత్రం ఉండే అవకాశాలు లేవని తెలిపింది.

నిబంధనలు మరింత కఠినతరం..
చైనా సహా వివిధ దేశాలు భారీ ప్యాకేజీలు ప్రకటించాయని కానీ మాంద్యం ముప్పు మాత్రం తప్పదని తెలిపింది. రానున్న కాలంలో విదేశీ మారక నిబంధనలు సైతం మరింత కఠినతరం కావొచ్చునని పేర్కొంది. ఈ సంక్షోభానికి ప్రతిస్పందించేందుకు ద్రవ్య, ఆర్థిక, పరిపాలనా సామర్థ్యం లేని కారణంగా మాంద్యంలోకి జారుకుంటుందని తెలిపింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల వైపు ఆ దేశాల పురోగతిని నిలిపివేస్తాయని తెలిపింది.

ఇలా చేయండి..
ఈ క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు కూడా కొన్ని ప్రతిపాదనలు చేసింది UNCTAD. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) నిబంధనలను సడలించి ఆయా దేశాలకు లక్ష కోట్ల డాలర్ల మేర ద్రవ్య లభ్యత కల్పించాలని పేర్కొంది. పేద దేశాలు సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ సంవత్సరం కట్టాల్సిన అప్పులను రద్దు చేయాలని ప్రతిపాదించింది. ప్రపంచ ఆరోగ్య సంక్షోభం నుంచి కాపాడేందుకు 500 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేయాలని సూచించింది.


Click it and Unblock the Notifications