గ్లోబల్ ఎకానమీకి షాక్, భారత్‌కు బిగ్ బూస్ట్.. వరల్డ్ బ్యాంక్ తాజా నివేదికలో సంచలన విషయాలు..
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం పటిష్టమైన వృద్ధితో దూసుకుపోతోంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించినా, భారతదేశ వృద్ధి అంచనాను మాత్రం స్వల్పంగా పెంచింది.
గురువారం విడుదల చేసిన 'జూన్ 2026 గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్' నివేదికలో.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY27) భారత వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 6.5% నుండి 6.6%కి పెంచుతున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో మెరుగైన వృద్ధిని కనబరుస్తున్న కొన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలిచింది.

ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం.. భారత ఆర్థిక వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) నమోదైన 7.7% నుండి 2026-27లో (FY27) 6.6%కి స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆ తర్వాతి ఏడాది అంటే 2027-28 (FY28) నాటికి మళ్లీ 7.2% వేగంతో పుంజుకోనుంది. ఈ తాత్కాలిక మందగమనం ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తన స్థానాన్ని నిలబెట్టుకోనుంది.
2026 నాటికి 6.3% వృద్ధి సాధిస్తుందని అంచనా వేసిన దక్షిణాసియా ప్రాంత ఆర్థిక వృద్ధికి భారత్ ఒక ఇంజన్‌లా సారథ్యం వహించనుంది. ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ ప్రతికూలతలు ఉన్నప్పటికీ, దేశీయ డిమాండ్ , పటిష్టమైన ఆర్థిక కార్యకలాపాల వల్లే భారతదేశానికి ఈ సానుకూల అంచనాలు సాధ్యపడ్డాయి. మన పొరుగు దేశమైన చైనా 2026 నాటికి కేవలం 4.2% వృద్ధికే పరిమితం కానుండటం గమనార్హం.
మరోవైపు, పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ అతలాకుతలమవుతోంది. ఇంధన సరఫరాకు అంతరాయం కలగడం వల్ల వస్తువుల ధరలు , ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతున్నాయి. ఫలితంగా, ప్రపంచ బ్యాంకు 2025లో 2.9%గా ఉన్న ప్రపంచ వృద్ధి అంచనాను 2026 నాటికి 2.5%కి తగ్గించింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత బలహీనమైన వృద్ధి రేటు ఇదే కావడం గమనార్హం.
నివేదిక ప్రకారం, 2026లో మొత్తం వస్తువుల ధరలు 22% పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు సగటున $94గా ఉండవచ్చని అంచనా వేశారు. ఇది గత ఏడాది కంటే 36% ఎక్కువ. ప్రపంచంలోనే ముడి చమురును భారీగా దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం ఒకటి కాబట్టి, ఈ ధరల పెరుగుదల ప్రభుత్వ ఖజానాపై, ఇంధన సబ్సిడీలపై అదనపు భారాన్ని పెంచే ప్రమాదం ఉంది.
భవిష్యత్తులో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే ప్రపంచ వృద్ధి రేటు ఏకంగా 1.3 శాతానికి పడిపోవచ్చని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు ద్రవ్య స్థిరత్వాన్ని కాపాడుకుంటూ, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా విధానాలు రూపొందించుకోవాలని సూచించింది. అయినప్పటికీ, ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులను బట్టి చూస్తే బ్యారెల్‌కు $94 చమురు ధర ఉన్నా కూడా భారత వృద్ధి అంచనా పటిష్టంగానే ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక సవాళ్లను తట్టుకుని నిలబడటంలో భారతదేశ ఆర్థిక విధానాలు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications
