Wipro Q4 profits: విప్రో లాభం రూ.2,345 కోట్లు, తగ్గిన లాభం
ఐటీ దిద్గజం విప్రో జనవరి - మార్చి క్వార్టర్‌కు ఏకీకృత ప్రాతిపదికన రూ.2,345.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో నమోదు చేసిన రూ.2,493.90 కోట్లతో పోలిస్తే 6 శాతం తగ్గింది. ఆదాయం 4.6 శాతం పెరిగి రూ.15,006.30 కోట్ల నుండి రూ.15,711 కోట్లకు చేరుకుంది. కరోనా నేపథ్యంలో విప్రో ఫలితాల సమయంలో వెల్లడించే ఆదాయ అంచనాల ప్రకటనకు దూరంగా ఉంది. కరోనా కారణంగా ఆదాయ, లాభాల వృద్ధిని అంచనా వేయలేకపోతోంది.
కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న ప్రస్తుత తరుణంలో ఆర్థిక ఫలితాలు విడుదల చేసింది విప్రో సంస్థ. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను కంపెనీ రూ.15,711 కోట్ల ఆదాయాన్ని గడించింది. డాలర్ రూపంలో కంపెనీ ఆదాయం 2,095 మిలియన్ డాలర్ల నుంచి 2,073.70 మిలియన్ డాలర్లకు పడిపోయింది.

గత ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా చూస్తే నికర లాభం 8% వృద్ధితో రూ.9.772 కోట్లకు, ఆదాయం 4% వృద్ధితో రూ.61,023 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి డివిడెండ్ ప్రకటించలేదు. జనవరి నెలలో ప్రకటించిన రూ.1 (50 శాతం) మధ్యంతర డివిడెండ్ మాత్రమే చివరిది. దీనినే 2019-20 ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌గా పరిగణించాలని తెలిపింది.
గత క్వార్టర్‌లో ముందస్తు అంచనా వేసిన మాదిరిగానే ఆర్థిక ఫలితాలు నమోదయ్యాయని, అదే సమయంలో కరోనా కారణంగా ఆదాయంలో 14-16 మిలియన్ డాలర్లు కోల్పోవాల్సి వచ్చిందని కంపెనీ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు భవిష్యత్తు అంచనావేయడం కష్టమవుతోందని, దీంతో ఆదాయ, లాభాల ముందస్తు అంచనావేయడం లేదని కూడా తెలిపింది.


Click it and Unblock the Notifications