విప్రోలో వారికే ఎక్కువ ఉద్యోగాలు, కొత్త సీఈవో వేతనం రూ.38 కోట్లు
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత నుండి ఎక్కువగా కంపెనీలు అమెరికాలో స్థానికులకే ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రధానంగా ఐటీ సంస్థలు 50 శాతానికి పైగా స్థానికులను కలిగి ఉన్నాయి. అమెరికాలో తమ కంపెనీలో 69.5 శాతం మంది స్థానిక ఉద్యోగులు ఉన్నారని టెక్ దిగ్గజం విప్రో 2019-20 వార్షిక నివేదికలో వెల్లడించింది. బెంగళూరు ఆధారిత ఈ కంపెనీ ఆదాయంలో గత ఆర్థిక సంవత్సరంలో 59.1 శాతం ఆదాయం అమెరికా నుండి వచ్చిందని తెలిపింది.

స్థానికులకే ఉద్యోగాలు
స్థానిక అభ్యర్థులకే ఉద్యోగ నియామకాలలో ప్రాధాన్యతను ఇస్తున్నట్లు విప్రో తెలిపింది. ఇందులో భాగంగా అగ్రరాజ్యంలో 69% స్థానికులే ఉన్నారు. లాటిన్ అమెరికాలో అన్ని ఉద్యోగాల్ని స్థానికుల ద్వారా నియమించుకున్నామని తెలిపింది. స్థానికులకే ఉద్యోగాలకు అనుగుణంగా కొద్దికాలంగా ఐటీ కంపెనీలు అక్కడి వారికి శిక్షణను ఇచ్చి నియమించుకుంటున్నాయి. నైపుణ్యం ఉన్న స్థానికులకే ఉద్యోగ నియామకాలలో ప్రాధాన్యమిస్తున్నట్లు విప్రో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష 88వేల మంది ఉద్యోగులు విప్రోకు సేవలందిస్తున్నారు.

41,000 మంది నియామకం
గత కొన్నేళ్లుగా భారత ఐటీ సంస్థలు ప్రధానంగా అమెరికాలో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. హైలీ స్కిల్డ్ వర్కర్స్‌ను మన దేశం నుండి తీసుకు వెళ్లే హెచ్1బీ వీసాలపై ఆధారపడటం తగ్గిస్తున్నాయి. ఇటీవల వస్తున్న వార్తల మేరకు డొనాల్డ్ ట్రంప్ కరోనా కారణంగా కొద్ది నెలల పాటు హెచ్1బీ వీసా కేటగిరీతో పాటు వివిధ వీసాలను రద్దు చేసే అవకాశముంది. విప్రో స్థానిక ఉద్యోగుల అంశంపై వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో విప్రోకు 1,88,270 మంది ఉద్యోగులు ఉండగా, భారత్ వెలుపల స్థానికులను 41,000 మంది ఉద్యోగులను నియమించుకుంది.

ఆస్ట్రేలియాలో 40 శాతం
యూరోప్‌లో విప్రో స్థానిక వర్క్ ఫోర్స్ 67.6 శాతం ఉండగా, ఆస్ట్రేలియాలో 40 శాతం, యూకేలో 33 శాతం ఉంది. అమెరికా, లాటిన్ అమెరికా, కాంటినెంటల్ యూరోప్, యూకే, ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో మా కస్టమర్లకు సాధ్యమైనంత వరకు స్థానికంగా సేవలు అందిస్తున్నామని చెబుతోంది.

విప్రో కొత్త సీఈవో వేతనం రూ.38 కోట్లు
ఇదిలా ఉండగా విప్రో లిమిటెడ్ కొత్త సీఈవో థియర్రీ డెలాపోర్డ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఏడాది వేతనం 4.45 మిలియన్ యూరోలు లేదా రూ.38 కోట్లు. దీంతో పాట్ స్టాక్స్ సహా ఇతర ప్రయోజనాలు ఉంటాయి. అతని వేతనంలో 1.07 నుండి 1.4 మిలియన్ యూరోల వరకు బేసిక్ పే, 1.7 నుండి 2.5 మిలియన్ యూరోల వరకు టార్గెట్ వేరియబుల్ పే.


Click it and Unblock the Notifications