వారంలో రూ.4000 తగ్గిన బంగారం ధర, నేడు మళ్లీ పెరిగి షాకిచ్చింది
బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చర్చలపై అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ ఫెడ్ వడ్డీరేటు పెంపు వంటి వివిధ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. దీంతో పసిడి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఓ సమయంలో రూ.55,000 క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రోజుల్లో రూ.4000కు పైగా తగ్గాయి. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.400 వరకు క్షీణించింది. గత వారం ఓ సమయంలో రూ.72,000 క్రాస్ చేసిన సిల్వర్ కూడా ఇప్పుడు రూ.67,000 స్థాయికి వచ్చింది. అయితే నిన్నటి వరకు తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్, నేడు మాత్రం మళ్లీ పెరిగి, షాకిచ్చింది.

మళ్లీ పెరిగిన బంగారం ధర
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.51,000 స్థాయికి వచ్చింది. అయితే నేడు మాత్రం పెరిగింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.392 పెరిగి రూ.51,539 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.437 పెరిగి రూ.52,000 వద్ద ట్రేడ్ అయింది.
సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న రూ.67,500 దిగువకు వచ్చాయి. కానీ నేడు రూ.1000కి పైగా పెరిగి రూ.68,400ను సమీపించింది. ఉదయం గం.10 సమయానికి మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1046 పెరిగి రూ.68,350 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1034 పెరిగి రూ.69,150 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లోను ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1909 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. నేడు 28 డాలర్లు లాభపడి 1937 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 కాగా, గత వారం 2070 డాలర్లు సమీపించింది. ఆ తర్వాత 1900 డాలర్ల స్థాయికి పడిపోయింది. అంటే 160 డాలర్లు క్షీణించింది. కానీ అంతలోనే మళ్లీ పెరుగుతోంది.
సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 24.71 డాలర్ల వద్ద ముగిసింది. నేడు 0.755 డాలర్లు లాభపడి 25.465 డాలర్ల వద్ద ముగిసింది.

అందుకే ధరలు తగ్గి, పెరిగాయి
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల నుండి 50 బేసిస్ పాయింట్ల మధ్య పెంచుతుందని, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లుగా కనిపించడం తదితర అంశాలు బంగారం నిన్నటి వరకు భారీగా తగ్గడానికి కారణమయ్యాయి. కానీ పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యాఖ్యలను బట్టి యుద్ధ తీవ్రత తగ్గలేదని తెలుస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో నేడు ధరలు పెరిగాయి.


Click it and Unblock the Notifications