ఎక్స్‌పీరియన్స్ లేకపోతే జాబ్ ఇవ్వరు.. జాబ్ ఇవ్వకపోతే ఎక్స్‌పీరియన్స్ ఎలా వస్తుంది? టెక్కీల ఎమోషనల్ డిబేట్!
డిగ్రీ పూర్తి చేస్తారు, ఎంతో ఆశతో ఒక మంచి రెజ్యూమే బిల్డ్ చేస్తారు, నెలల తరబడి వందలాది కంపెనీలకు అప్లై చేస్తూ ఇన్బాక్స్ వైపు చూస్తూ ఉంటారు. కానీ, చివరకు తెలిసే చేదు నిజం ఏంటంటే.. కనీసం స్టార్టింగ్ లెవెల్ (Entry-level) jobs కి కూడా కంపెనీలు ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నాయి! ప్రస్తుతం భారతదేశంలోని లక్షలాది మంది యువతీ యువకులు ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితి ఇది.
గ్లోబల్ హైరింగ్ ప్లాట్‌ఫామ్ 'ఇండీడ్' (Indeed) తాజాగా జరిపిన సర్వేలో ఎన్నో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. దాదాపు 70 శాతం మంది యువ నిరుద్యోగులు.. 3 నుండి 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మొదటి ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంగా మారిందని చెప్తున్నారు. విపరీతమైన కాంపిటీషన్, పెరిగిపోయిన ఎక్స్‌పీరియన్స్ డిమాండ్స్ దీనికి ముఖ్య కారణాలు.

ఎక్స్‌పీరియన్స్ పారడాక్స్: అసలు ఇదెక్కడి న్యాయం?
ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు 72 శాతం మంది అభ్యర్థులు ఒకే ఒక ప్రధాన సమస్యను లేవనెత్తారు. అదే "ఎక్స్ పీరియన్స్ పారడాక్స్" (Experience Paradox). అంటే.. ఉద్యోగం ఇస్తేనే కదా ఎక్స్‌పీరియన్స్ వచ్చేది, కానీ మీరేమో ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ఉద్యోగం ఇస్తామంటున్నారు, మరి మాకు అనుభవం ఎలా వస్తుంది? అని ఫ్రెషర్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇంకోవైపు కాలేజీల్లో చదివేటప్పుడు అందరికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరకడం లేదు. కేవలం 20 శాతం మందికి మాత్రమే పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ (Paid Internships) చేసే అవకాశం దక్కింది. మరో 18 శాతం మందికైతే అసలు ఎలాంటి ఇంటర్న్‌షిప్స్, ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్, ప్లేస్‌మెంట్ సపోర్ట్ లేదా ఫ్రీలాన్స్ అవకాశాలు అస్సలు దొరకలేదని తేలింది.
కెరీర్ ప్రారంభంలోనే రాజీ పడుతున్న యువత!
పరిస్థితులు ఇలా ఉండటంతో, చాలామంది యువకులు తమకు నచ్చిన ఉద్యోగం కోసం కాకుండా, ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అనే పొజిషన్‌కు వచ్చేస్తున్నారు. కేవలం 14 శాతం మంది మాత్రమే తాము అనుకున్న రోల్, అనుకున్న కంపెనీ లేదా లొకేషన్‌లో జాబ్ సాధించగలమని నమ్ముతున్నారు. మిగిలిన 43 శాతం మంది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల వల్ల తమ లాంగ్ టర్మ్ గోల్స్‌ను పక్కన పెట్టేసి, దొరికిన చిన్న jobs లోనే జాయిన్ అయిపోతున్నారు.
హైరింగ్ బ్లాక్ హోల్: అప్లై చేస్తే రిప్లై ఉండదు!
ఫ్రెషర్స్ ఎదుర్కొంటున్న మరో పెద్ద తలనొప్పి ఏంటంటే.. ఎన్ని జాబ్స్‌కు అప్లై చేసినా అసలు తమ రెజ్యూమే షార్ట్‌లిస్ట్ అవుతుందో లేదో తెలియకపోవడం. దాదాపు 49 శాతం మంది అభ్యర్థులు ఈ 'షార్ట్‌లిస్టింగ్' ప్రాసెస్‌ను అత్యంత కష్టమైన అడ్డంకిగా భావిస్తున్నారు. దీనికి తోడు కంపెనీల నుండి కనీస కమ్యూనికేషన్ కూడా ఉండదు. 61 శాతం మంది తాము అప్లై చేసిన తర్వాత కంపెనీల నుండి ఎలాంటి రిప్లై లేదా ఈమెయిల్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా ఒక చీకటి గుహలా (Black Hole) మారిపోయిందని అనుకుంటున్నారు.
మోరల్ దెబ్బతింటోంది.. కంపెనీలు మారాలి!
వరుస అప్లికేషన్లు, ఆపై వచ్చే రిజెక్షన్ల వల్ల దాదాపు 64 శాతం మంది యువత మానసికంగా కుంగిపోతున్నారు. వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతున్నాయి. కేవలం 20 శాతం మంది మాత్రమే తాము అనుకున్న కెరీర్ ట్రాక్‌లో వెళ్తున్నట్లు ఫీలవుతున్నారు.
ఇండీడ్ టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్ రోహన్ సిల్వెస్టర్ మాట్లాడుతూ.. "కంపెనీలు కేవలం ఎక్స్‌పీరియన్స్ అనే లెన్స్ ద్వారా మాత్రమే ఫ్రెషర్లను చూడకూడదు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేలా స్పష్టమైన మార్గాలను ఏర్పాటు చేయాలి. వారిలోని పొటెన్షియల్‌ను గుర్తించి, ఆన్-ది-జాబ్ లెర్నింగ్ (పని చేస్తూ నేర్చుకునే) అవకాశాలు కల్పిస్తేనే లాంగ్ టర్మ్‌లో కంపెనీలకు మంచి టీమ్ బిల్డ్ అవుతుంది" అని హితవు పలికారు. అలాగే కాలేజీల్లోని ప్లేస్‌మెంట్ సెల్స్, రెజ్యూమే గైడెన్స్ , ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సపోర్ట్ వంటివి నేటి కఠినమైన మార్కెట్‌లో ఫ్రెషర్స్‌కు ఎంతో అవసరమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications