భారతదేశం నుంచి సంపన్నులైన కోటీశ్వరులు విదేశాలకు తరలిపోతున్న మార్పు గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. చాలా మంది దీనికి కాలుష్యం, పన్నులు, జీవన ప్రమాణాలు లేదా విదేశాల్లో విలాసవంతమైన జీవితం వంటి కారణాలనే చెబుతుంటారు. అయితే వాస్తవానికి ఈ వలసల వెనుక ఉన్న అసలు కారణాలు ఇవి మాత్రమే కాదని.. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) సభ్యుడైన ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ స్పష్టం చేశారు.
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సన్యాల్.. భారతీయ వ్యాపార రంగంలో ఉన్న నిర్మాణాత్మక లోపాలు (Structural Issues), పోటీ కొరత కోటీశ్వరుల వలసకు ప్రధాన కారణాలని వెల్లడించారు. దేశంలో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు (Innovation) ఎదగడానికి సరైన వాతావరణం లేకపోతే.. సంపన్నులు తమ సంపదను రిస్క్‌లో పెట్టడం కంటే విదేశాల్లో భద్రతను కోరుకుంటారని ఆయన అన్నారు.

భారతదేశంలో అనేక పెద్ద పరిశ్రమలు, వ్యాపార సంస్థలు దశాబ్దాలుగా ఒకే కుటుంబాలు లేదా వ్యక్తుల ఆధిపత్యంలో కొనసాగుతున్నాయని సన్యాల్ వ్యాఖ్యానించారు. దీని వల్ల కొత్త వ్యాపారవేత్తలకు, కొత్త ఆలోచనలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని తెలిపారు. పోటీ లేకపోవడం వల్ల ఆవిష్కరణలు అణచివేయబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సంపన్న వ్యాపారవేత్తలు కొత్త ప్రయోగాలు చేయడం కన్నా తమ సంపదను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
అందుకే చాలా మంది millionaires దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో ఫ్యామిలీ ఆఫీసులు, పెట్టుబడి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ విధానాల స్పష్టత, తక్కువ అధికారిక అడ్డంకులు, స్థిరమైన పాలన ఉండటం వారికి ఆకర్షణగా మారుతోంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితమైన విషయం కాదని.. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తాయని సన్యాల్ తెలిపారు.
భారతీయ కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలపై భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ.. పరిశోధన, సాంకేతికత, ఉత్పత్తి ఆవిష్కరణలపై పెట్టుబడి మాత్రం తక్కువగా ఉందని ఆయన అబిప్రాయపడ్డారు. దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక బలాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
అయితే భారతదేశంలోని స్టార్టప్ వ్యవస్థపై సన్యాల్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా బెంగళూరు వంటి నగరాల్లో యువ వ్యాపారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడడం లేదని ఆయన అన్నారు. కొత్త ఆలోచనలు, కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్న ఈ వాతావరణం దేశానికి ఆశాజనకమని తెలిపారు. పెద్ద పరిశ్రమలు కూడా ఇదే మనస్తత్వాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థలో వైఫల్యానికి కూడా చోటు ఉండాలని సన్యాల్ స్పష్టం చేశారు. పెద్ద కంపెనీలు విఫలమైతే వాటిని కొనసాగించకుండా, మూసివేయడానికి అనుమతిస్తేనే కొత్త వ్యాపారాలకు అవకాశాలు వస్తాయని చెప్పారు. జెట్ ఎయిర్‌వేస్ పతనం, గత బ్యాంకింగ్ సంక్షోభాలు కొత్త అవకాశాలకు దారి తీశాయని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
హెన్లీ & పార్టనర్స్ 2025 నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సుమారు 3,500 మంది మిలియనీర్లు భారతదేశం విడిచిపెట్టే అవకాశం ఉంది. 2024లో ఈ సంఖ్య 4,300 కాగా, 2023లో 5,100 మంది దేశం విడిచారు. ఈ గణాంకాలు సంపన్నులు విదేశీ అవకాశాల వైపు ఆకర్షితులవుతున్న వాస్తవాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications