ఈ ఉద్యోగాలు నమ్ముకుంటేనే సేఫ్.. జీతాలు కూడా ఎక్కువ.. సంచలన నివేదిక వెల్లడించిన షాకింగ్ నిజాలు..
వచ్చే ఆర్థిక సంవత్సరం (FY27) లో దేశీయ కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ పెంపుదల వేగం గత ఏడాదితో పోలిస్తే కొంచెం నెమ్మదించవచ్చని ప్రముఖ మానవ వనరుల సేవల సంస్థ 'టీమ్‌లీజ్ సర్వీసెస్' (TeamLease Services) తన తాజా నివేదికలో వెల్లడించింది.
వివిధ పరిశ్రమలలోని వ్యాపార పరిస్థితులను బట్టి ఈసారి వేతనాల పెంపు సగటున 8.6 శాతం నుండి 10.2 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది. గత సంవత్సరంలో ఈ పెంపుదల పరిధి 6.2 శాతం నుండి 11.3 శాతం వరకు విస్తరించి ఉంది. కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులందరికీ ఒకే రకమైన పెంపును ఇచ్చే సాంప్రదాయ పద్ధతిని పక్కనబెట్టి, వ్యాపార వృద్ధికి నేరుగా ఉపయోగపడే ప్రత్యేక నైపుణ్యాలు (Specialized Skills) కలిగిన సిబ్బందిపైనే ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.

పరిశ్రమల వారీగా చూస్తే.. ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఈవీ మౌలిక సదుపాయాల (EV Infrastructure) రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈసారి అత్యధిక లబ్ధి పొందనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి చెందిన ఉద్యోగుల సగటు జీతం 10.2 శాతం పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇది గత ఏడాది నమోదైన 11.3 శాతం కంటే కొద్దిగా తక్కువే అయినప్పటికీ, ప్రస్తుతం అన్ని రంగాల కంటే ఇదే అత్యధిక వృద్ధి కావడం విశేషం.
దీనితో పాటు ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డిజిటల్ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న ఫిన్‌టెక్ (FinTech) కంపెనీలలో సుమారు 10 శాతం మేర, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ రంగాలలో 9.7 శాతం, అలాగే విద్యుత్, ఇంధన (Power & Energy) రంగాలలో 9.6 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రంగాలలో వృద్ధి మందగించింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ (వినియోగ మన్నిక గల వస్తువులు) రంగంలో జీతాల పెంపు 10.7 శాతం నుండి 9 శాతానికి, ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) రంగంలో 10.4 శాతం నుండి 8.9 శాతానికి తగ్గే ఛాన్స్ ఉంది. మరోవైపు, గతంలో తక్కువ పెంపును చూసిన విద్యా సేవలు, బీపీఓ (BPO) రంగాలు ఈసారి 6.2 శాతం మరియు 6.7 శాతం నుండి ఏకంగా 9 శాతానికి పుంజుకోవడం సానుకూల పరిణామం.
కంపెనీలలోని వివిధ విభాగాల (Departments), ఉద్యోగ పదవుల వారీగా చూస్తే.. ఇంజనీరింగ్ విభాగం 9.9 శాతంతో ముందంజలో ఉండగా, ఐటీ విభాగం 9.8 శాతం, సేల్స్ & మార్కెటింగ్ 9.7 శాతం, ఫైనాన్స్ 9.5 శాతం, హ్యూమన్ రీసోర్సెస్ (HR) 9 శాతం మరియు కస్టమర్ సర్వీస్ విభాగం 8.9 శాతం చొప్పున ప్రయోజనం పొందనున్నాయి. నిర్దిష్ట పదవుల విషయానికొస్తే, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు అత్యధికంగా 11.2 శాతం వరకు వేతనాల పెంపు లభించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ఇంజనీర్లకు 10.7 శాతం పెరుగుదల లభించనుండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, క్వాలిటీ అస్యూరెన్స్ (QA) ఇంజనీర్లు, మరియు సైట్ ఇంజనీర్లు రెండంకెల జీతాల పెంపును సొంతం చేసుకోనున్నారు.
భౌగోళికంగా చూస్తే.. దేశంలోని ప్రధాన నగరాలలో తమిళనాడు రాజధాని చెన్నై అత్యధికంగా 9.7 శాతం జీతాల పెరుగుదలతో అగ్రస్థానంలో నిలవనుంది. ఆ తర్వాతి స్థానాల్లో పుణె, హైదరాబాద్ నగరాలు 9.6 శాతంతో, అహ్మదాబాద్ 9.5 శాతం పెరుగుదలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కేవలం ప్రధాన మహానగరాలు మాత్రమే కాకుండా, ప్రస్తుతం అహ్మదాబాద్, నాగ్‌పూర్, జైపూర్, మరియు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం వంటి నగరాలు కూడా కొత్త పెట్టుబడులు, కార్పొరేట్ కంపెనీలను ఆకర్షిస్తూ ప్రతిభకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయని ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.


Click it and Unblock the Notifications
