అన్-లాక్: భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు, ఎలా కోలుకుంటుంది?
కరోనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థలు ఇప్పడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అగ్రరాజ్యాలు సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దారుణంగా పడిపోతున్నాయి. వివిధ సంస్థలు కూడా ఆయా దేశాల ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల వరకు కూడా రికవరీ కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. కరోనా కారణంగా భారత్‌కు దాదాపు రూ.30 లక్షల కోట్లకు అటు ఇటుగా నష్టం జరిగింది. ఇది ఎలా కోలుకుంటుంది, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

భారత్ కోలుకోవడం వీటిపై ఆధారపడి ఉంటుంది
అమెరికా ఆర్థిక వ్యవస్థ V షేప్‌లో పుంజుకోవచ్చునని ఆర్థిక నిపుములు అంచనా వేస్తున్నారు. భారత్ కూడా V షేప్‌లోనే పుంజుకుంటుందా? ఇప్పటికే అన్-లాక్ ప్రారంభమైంది. ఆర్థిక వ్యవస్థలు తెరుచుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో Z లేదా U లేదా Z షేప్‌ను అనుసరిస్తుందా? భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం... ఉద్యోగాల సృష్టి, డిమాండ్, గృహ ఆదాయాలు-ప్రభావం, ప్రభుత్వం అందించే ఆర్థిక ఉద్దీపన వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Z షేప్ రికవరీ
ఆర్థిక అంతరాయం ప్రజల ఆదాయాల కంటే ఎక్కువగా ఉంటే, స్వల్పకాలం ఉంటే అప్పుడు ఖర్చు సామర్థ్యం పరిమితంగా ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత Z షేప్ రికవరీ ఉంటుందని చెబుతున్నారు. అంటే కరోనా ప్రభావం లేకుంటే ఇప్పటికే వృద్ధి ఓ దశకు చేరుకునేది. ఇప్పుడు కరోనా కారణంగా ప్రజలకు వ్యయం చేసే శక్తి లేక తాత్కాలికంగా ఖర్చు సామర్థ్యం తగ్గుతుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయగానే హఠాత్తుగా భారీగా పెరుగుతుంది. క్రమంగా ఈ ఖర్చు సామర్థ్యం తగ్గి.. స్థిరంగా ఉంటుంది.

ఇవి కూడా అవసరం
అయితే ఇది మాత్రమే వృద్ధికి అనుకూలం కాదు. ఎందుకంటే సేలూన్లు, థియేటర్లు, కొత్త వాహనాల కొనుగోలు, ఇళ్లు కొనుగోలు, హోమ్ అప్లియెన్సెస్ వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అంటే కరోనాకు ముందు ఆయా రంగాలు లేదా ఉత్పత్తులకు ఉన్న డిమాండ్, ప్రస్తుత ఆ రంగాలు లేదా ఆ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ పైన కూడా ఆధారపడి ఉంటుంది.

ఆర్థిక అంతరాయం ఎక్కువ కాలం ఉంటే
లాక్ డౌన్ ఎక్కువకాలం ఉంటే ఆర్థిక అంతరాయం ఎక్కువ కాలం ఉంటే కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ దీర్ఘకాలం కూడా ఉండకపోవచ్చు. తక్కువ కాలం ఆర్థిక అంతరాయం ఏర్పడితే కారు కొనుగోలు చేయాలనున్న వ్యక్తి వాయిదా వేసుకుంటాడు. కానీ ఆర్థిక అంతరాయం ఎక్కువ కాలం ఉంటే కొనుగోలు వాయిదా వేయడానికి బదులు అసలు కొనడమే మానివేస్తాడు. ఇప్పటికే ఈ మూడు నెలల కాలంలో మీరు సెలూన్‌కు వెళ్లకపోవడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచి, అది శాశ్వతంగా నష్టపోయిన అంశం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థ V షేప్‌లో కూడా కోలుకునే అవకాశముంది. ఎక్కువ సమయం తీసుకుంటే U షేప్‌లో కోలుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఆరు నెలల నుండి ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications