ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి.. దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యాకు చెందిన మరో స్థిరాస్తి అమ్ముడైంది. విజయ్ మాల్యాకు ఇచ్చిన రుణాలను రికవరీ చేసుకోవడంలో భాగంగా ఆయనకు చెందిన ఆస్తులన్నింటినీ వేలం పాటల ద్వారా విక్రయిస్తూ వస్తోన్నాయి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు. ఇందులో భాగంగా- మరో స్థిరాస్తి చేతులు మారింది. హైదరాబాద్‌కు చెందిన టాప్ రియల్టర్ కంపెనీ ఆ స్థిరాస్తిని కొనుగోలు చేసింది. బ్యాంకులు నిర్దేశించిన రిజర్వ్ ప్రైస్ కంటే కూడా సగం రేటుకే అది విక్రయమైంది.

కింగ్‌ఫిషర్ హౌస్..
అదే- కింగ్‌ఫిషర్ హౌస్. ముంబైలోని భవన సముదాయం ఇది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బిల్డింగ్. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు హెడ్ క్వార్టర్స్‌గా వందలాది మంది ఉద్యోగులు, సిబ్బందితో కళకళలాడుతూ ఉండేది. ముంబై నవ్‌పాడా విల్లేపార్లె ఈస్ట్ ప్రాంతంలో ఉందీ భవన సముదాయం. శాంతాక్రజ్‌లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంటుంది ఇది. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్, అప్పర్ ఫ్లోర్‌లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు కొనసాగాయి. పోష్ ఏరియాలో ఉన్న ఈ భవన సముదాయానికి మంచి డిమాండ్ ఉండేది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరు మీద దీన్ని రిజిస్టర్ చేయించారు. దీని మార్కెట్ విలువ 150 కోట్ల రూపాయలు.

రూ.52 కోట్లకే..
ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యాకు ఇచ్చిన తమ రుణాలను రికవరీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరు మీద కొనసాగుతోన్న ఈ భవనాన్ని బ్యాంకర్లు వేలంపాట ద్వారా విక్రయించారు. మొదట దీని రిజర్వ్ ప్రైస్‌ను 135 కోట్ల రూపాయలుగా నిర్ణయించగా.. అమ్ముడు పోలేదు. ఆ భవనాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. 2019 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు దీన్ని విక్రయించడానికి వేలంపాటలను నిర్వహించినప్పటికీ.. అది అమ్ముడు పోలేదు. దీనితో రిజర్వ్ ప్రైస్‌ను తగ్గించారు బ్యాంకర్లు. దీనితో హైదరాబాద్‌కు చెందిన శాటర్న్ రియల్టర్స్ కంపెనీ దీన్ని కొనుగోలు చేసింది. 52.25 కోట్ల రూపాయలకు ఈ భవనాన్ని కొనుగోలు చేసింది.

రికవరీ కొనసాగింపు..
కాగా- విజయ్ మాల్యాకు ఇచ్చిన రుణాల రికవరీ వ్యవహారంలో బ్యాంకర్లు ఇప్పటికే 7,250 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన స్థిర, చరాస్తులను వేలంపాటల ద్వారా విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకున్నారు. ఇంకా 1,875 కోట్ల రూపాయలను రికవరీ చేయాల్సి ఉంది. విజయ్ మాల్యాకు రుణాలను ఇచ్చిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి.. ఆ ఆస్తులను వేలం వేస్తోన్నాయి. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని రుణ శాతంగా పంచుకుంటోన్నాయి. ఈ కన్సార్టియానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తోంది.

ఎస్బీఐ కన్సార్టియం..
ఇదిలావుండగా.. బ్యాంకర్లు.. తాను చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ నిధులను రికవరీ చేసుకున్నాయనేది విజయ్ మాల్యా వాదన. వడ్డీని మినహాయిస్తే.. తాను అసలు మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానంటూ విజయ్ మాల్యా ఇదివరకే ప్రకటించారు. దీన్ని బ్యాంకర్లు పరిగణనలోకి తీసుకోలేదు. విజయ్ మాల్యా ఆస్తుల అమ్మకాలు కొనసాగుతోన్నాయి. బెంగళూరు, గోవా, ముంబై సహా అనేక ప్రాంతాల్లో ఆయనకు చెందిన రిసార్టులు, విల్లాలు, ప్రధాన కార్యాలయాలు, భవనాలు ఇలా ఒక్కొక్క స్థిర, చరాస్తులను వేలం వేశారు బ్యాంకర్లు.


Click it and Unblock the Notifications