భారత వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి ఆయన విదేశాల్లో ఉన్నాడు. ఇప్పటికే ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోగా, వీటి వేలానికి కూడా ముంబై కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. రూ.13వేల కోట్ల విలువైన ఆస్తుల జఫ్తుకు కోర్టు పచ్చజెండా ఊపింది.

అమ్మకానికి ఈడీ కోర్టు గ్రీన్ సిగ్నల్
దీంతో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ ఆస్తులను వేలం వేస్తుంది. జనవరి 18వ తేదీ తర్వాత వేలంపై ఆదేశాలు పాటించాలని కూడా కోర్టు తెలిపింది. దీనిపై సంబంధిత పార్టీలు కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశమిచ్చింది. సీజ్ చేసిన ఆస్తుల లిక్విడేషన్‌కు తమకు అభ్యంతరం లేదని గత ఏడాది ఫిబ్రవరిలో ఈడీ కోర్టుకు తెలిపింది.

ఫ్రాన్స్‌లో విలాస భవనం
ఇదిలా ఉండగా, మాల్యాకు ఫ్రాన్స్‌లోని ఓ ద్వీపంలో విలాసవంతమైన భవనం ఉంది. ఇది శిథిలావస్థకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. 17 బెడ్రూమ్స్, సినిమా థియేటర్, హెలిప్యాడ్, నైట్ క్లబ్ ఉన్న ఈ భవంతికి గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులు లేవు. దీంతో దెబ్బతిన్నట్లుగా పేర్కొంది.

30 మిలియన్ డాలర్ల లోన్ తీసుకొని కొనుగోలు
ఫ్రెంచ్‌లోని ఇలీ సెయింటీ మార్గరైట్ ద్వీపంలో 1.3 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ లీ గ్రాండ్ జార్డిన్ భవంతిని మాల్యా 2008లో కొనుగోలు చేశాడు. ఇందుకు ఖతార్ నేషనల్ బ్యాంకు ఎస్ఏక్యూకు చెందిన అన్స్‌బాచర్ అండ్ కో యూనిట్ నుంచి మాల్యా 30 మిలియన్ల డాలర్ల రుణం తీసుకున్నారు. గిజ్మో ఇన్వెస్ట్ కంపెనీ పేరుతో ఈ లోన్ తీసుకున్నారు. తర్వాత ఈ రుణం చెల్లించలేదు.

పడిపోయిన భవంతి ధర
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రుణ చెల్లింపులకు గడువు పెంచాలని మాల్యా కోరారు. దీంతో బ్యాంకు ఆ భవంతిని పరిశీలించగా, ఇప్పటికే దెబ్బతిన్నట్లు గుర్తించింది. అంతేకాదు దీని వ్యాల్యూ 10 మిలియన్ల మేర పడిపోయింది. దీంతో మాల్యాపై దావా వేసింది.

సూపర్ యాచ్ తర్వాత భవంతి అమ్మకానికి రంగం సిద్ధం
ఈ భవంతి రుణం కోసం మాల్యా ఇంగ్లాండులోని సూపర్ యాచ్‌ను సెక్యూరిటీగా పెట్టారు. దీంతో ఈ సూపర్ యాచ్‌ను అమ్మి రుణం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని అన్స్‌బాచర్ లండన్ కోర్టును ఆశ్రయించింది. ఈ సూపర్ హాచ్‌తో మాత్రమే తమ రుణం తీరదని కాబట్టి మాల్యా ఫ్రెంచ్ సౌధం కూడా అమ్మకానికి పెట్టినట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications