Layoff News: దాదాపు రెండేళ్లుగా ప్రపంచ టెక్ కంపెనీల్లో కొలువుల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. నెలలు త్రైమాసికాలు గడుస్తున్నా పరిస్థితుల్లో పరిస్థితులు దిగజారుతూనే ఉన్నాయి. దీంతో టెక్కీల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ వంతు ఎప్పుడు వస్తుందో అని వారు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో యూఎస్ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులను మళ్లీ తగ్గిస్తుంది. తాజా చర్యలతో గూగుల్ ఖర్చులను తగ్గించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి బుధవారం తెలిపారు. అయితే లేఆఫ్‌ల వల్ల ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యపై ప్రతినిధి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. కంపెనీ సిబ్బంది కోత వల్ల ప్రభావితమైన కొంతమంది వ్యక్తులను భారతదేశం, చికాగో, అట్లాంటా, డబ్లిన్‌తో సహా పెట్టుబడి పెట్టే ప్రదేశాలకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడైంది.

టెక్ అండ్ మీడియా కంపెనీలు ఈ సంవత్సరం భారీ తొలగింపులకు దిగటంతో ఈ రంగంలోని ఉద్యోగుల్లో భయాలు పెరుగుతున్నాయి. చాలా సంస్థలు వ్యాపార ఒడిదొడుకులతో ఇప్పటికీ ఆర్థిక అనిశ్చితితో పోరాడుతున్నాయి. కోతల కారణంగా గూగుల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ విభాగాలు ప్రభావితమయ్యాయని వెల్లడైంది. ప్రభావిత విభాగాల్లోని ఉద్యోగులు గూగుల్ ట్రెజరీ, బిజినెస్ సర్వీసెస్, రెవెన్యూ క్యాష్ కార్యకలాపాలకు చెందినవారే. దీనికి ముందు సైతం 2024 జనవరిలోగూగుల్ సిబ్బందిని తొలగించిన సంగతి తెలిసిందే.
ప్రపంచం ప్రస్తుతం ఏఐ సాంకేతికత చుట్టూ తిరుగుతున్న వేళ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫర్‌లలో కంపెనీ పెట్టుబడులను పెంచడంతో.. ఇంజనీరింగ్, హార్డ్‌వేర్ అండ్ సపోర్ట్ టీమ్‌లతో సహా వందలాది మంది ఉద్యోగులను జనవరిలో గూగుల్ తొలగించింది. అయితే కంపెనీలో ఉద్యోగుల కోతల గురించి సీఈవో సుందర్ పిచాయ్ ఈ ఏడాది ప్రారంభంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. గడచిన సంవత్సరం టెక్ దిగ్గజం గూగుల్ దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. వీరు హార్డ్‌వేర్, యాడ్ సేల్స్, కొనుగోలు, మ్యాప్‌లు, స్ట్రాటజీ, ఇంజనీరింగ్, యూట్యూబ్‌తో సహా ఇతర విభాగాలకు చెందిన వారు కావటం గమనార్హం. టెక్ కంపెనీలు 2022 నుంచి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. అయితే భారత టెక్ కంపెనీలు ఈ సంక్షోభ సమయంలో కొత్త నియామకాలను దాదాపుగా నిలిపివేశాయి.


Click it and Unblock the Notifications