ఇద్దర్నీ ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం.. పెళ్ళైన 15 రోజుల తర్వాత అమెరికా వెళ్లిన భార్యాభర్తలకు కంపెనీ బిగ్ షాక్
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఒక టెక్ జంటకు పెళ్లైన 15 రోజులకే ఊహించని షాక్ ఎదురైంది. పెళ్ళి ఘడియల ఆనందాన్నిఅనుభవించకముందే వివాహం జరిగి కేవలం 15 రోజులు కూడా కాకముందే ఇద్దరూ తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2025 మే నెలలో ఆ దంపతులు ఇద్దరూ తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఒకే కంపెనీ, ఒకే రోజు, ఒకే నిర్ణయం అయినప్పటికీ..ఆ వార్తను చెప్పిన విధానం మాత్రం వారి జీవితాలపై పూర్తిగా భిన్నమైన ప్రభావాన్ని చూపింది.
ఈ Layoffs సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా వెలుగులోకి వచ్చింది. 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోష్ని తన అనుభవాన్ని ప్రపంచ నెటిజన్లతో పంచుకుంది. మే 2న నాకు పెళ్లి జరిగింది. అది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు. మే 13న నేను అమెరికాకు తిరిగి వచ్చాను. మే 17న మొదటిసారి ఆఫీసు పనిలో చేరాను. అయితే అదీ ప్రయాణం చేయడం వల్ల అనారోగ్యం కారణంగా ఇంటి వద్దే ఉండిపోయానని తెలిపింది.

కానీ ఆ రోజు పనిలో చేరిన కొద్దిసేపటికే.. ఆమె ఊహించని అనుభవాన్ని ఎదుర్కుంది. ఆమె మేనేజర్ నుంచి ఒక కాల్ వచ్చింది. కంపెనీలో జరుగుతున్న ఉద్యోగ కోతల కారణంగా మీరు ప్రభావితులయ్యారని ఆయన చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే రోష్ని పూర్తిగా షాక్‌కు గురైంది. తన కెమెరాను ఆఫ్ చేసి, ఆ వార్తను జీర్ణించుకోవడానికి కొంత సమయం తీసుకున్నానని ఆమె చెప్పింది.
ఇది నా పనితీరుతో సంబంధమా? నాకు గత రేటింగ్‌లో 4/5 వచ్చింది కదా? అని ఆమె అడిగినప్పుడు, ఆమె మేనేజర్ ఎంతో స్పష్టంగా, దయతో స్పందించారు. ఇది పనితీరు ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని, పూర్తిగా ఉద్యోగుల సంఖ్య తగ్గింపులో భాగమేనని ఆమెకు హామీ ఇచ్చారు. ఆమె భావోద్వేగ స్థితిని అర్థం చేసుకుని.. ఆ రోజు సెలవు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు, కాల్ ముగిసిన తర్వాత అవసరమైన వనరులు, సహాయం అందుబాటులో ఉండే మార్గాలను కూడా పంపించారు.
అదే సమయంలో, రోష్నిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్న ఆమె భర్త శుభమ్‌కు అతని మేనేజర్ నుంచి సందేశం వచ్చింది. మనిద్దరికీ ఇది ఏంటో తెలుసు" అనే సంక్షిప్త సందేశం. ఆ తర్వాత శుభమ్ ఆన్‌లైన్‌లో మాట్లాడేందుకు కోరినప్పటికీ.. అతని మేనేజర్ అతన్ని తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ఆదేశించారు. నీ భార్య బాధలో ఉన్నా సరే, నువ్వు రావాలి. నేను స్వయంగా చెప్పాలని అన్నారు.
ఆఫీసుకు చేరుకున్న శుభమ్ ముందు ఒక బ్రోచర్ పెట్టి.. నీకు ఇక ఉద్యోగం లేదని చాలా నిర్దాక్షిణ్యంగా చెప్పారు. వారిపై ఎలాంటి సానుభూతి లేదు, అలాగే ఎలాంటి వివరణ లేదు. ఆ క్షణం శుభమ్‌ను పూర్తిగా కుంగదీసింది. అది చాలా అకస్మాత్తుగా, గందరగోళంగా అనిపించింది. అతన్ని మానసికంగా పూర్తిగా ఇరుకున పెట్టిందని రోష్ని వివరించింది.
ఈ సంఘటన ద్వారా ఒక స్పష్టమైన తేడా బయటపడిందని రోష్ని చెబుతుంది. ఒక మేనేజర్ చెడు వార్త చెప్పినా నా ఆత్మగౌరవాన్ని కాపాడారు. మరొక మేనేజర్ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఒక మనిషిని తన విలువలపై అనుమానం కలిగేలా చేశారు. ఒకే కంపెనీ, ఒకే రోజు, ఒకే ఫలితం అయినా.. డెలివరీ విధానం జీవితాలను మార్చిందని ఆమె పేర్కొంది. రోష్ని తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ ఆమె అదే ధైర్యాన్ని తనతో తీసుకెళ్లగలిగింది. కానీ శుభమ్‌కు మాత్రం అది పూర్తిగా భిన్నమైన అనుభవంగా మారింది.
ఈ అనుభవాన్ని ఒక బలమైన సందేశంతో చివరికి ముగించింది రోష్ని.. అదేంటంటే.. చెడు వార్తలు అనివార్యం. కానీ వాటిని క్రూరంగా చెప్పడం మాత్రం ఒక ఎంపిక. మీరు ఎవరికైనా కఠినమైన వార్త చెబుతున్నప్పుడు, అది వారి జీవితంలో ఎలా గుర్తుండిపోతుందో మీరు నిర్ణయిస్తున్నారని గుర్తుంచుకోండి. కనీసం దయతో చెప్పండని తెలిపింది.


Click it and Unblock the Notifications