Yahoo Layoffs: అమెరికా ఆర్థిక వ్యవస్థ కొద్దికొద్దిగా కోలుకుంటోందని గణాంకాలు చెబుతున్నప్పటికీ అగ్రరాజ్యం మాత్రం ఇంకా ప్రమాదంలోనే ఉంది. అయితే ఈ ప్రభావం మార్కెట్లపై మరింతకాలం కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్న తరుణంలో తమ వ్యాపారాలను కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల ఊచకోతకు దిగుతున్నాయి.

యాహూ ప్రకటన..
అమెరికా కంపెనీలు చాలా కాలంగా ఉద్యోగుల కోతలను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో చేరిన యాహూ తన మెుత్తం ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మందిని ఇళ్లకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 1600 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇందులో కంపెనీకి చెందిన యాడ్ టెక్ ఉద్యోగులు భారీగా ప్రభావితం కానున్నారు.

డిస్నీ తొలగింపులు..
అమెరికాకు చెందిన ఎంటర్ టైన్ మెంట్ దిగ్గజం డిస్నీ తన ఉద్యోగుల్లో దాదాపు 7000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవలి కాలంలో కంపెనీ ఓటీటీ ఎక్కువ మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో రిలయన్స్ గ్రూప్ కు చెందిన వయాకామ్-18 ఐపీఎల్ హక్కులను కొనుగోలు చేయటంతో భారీగా డిస్నీ+హాట్ స్టార్ సబ్ స్క్రైబర్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో ఐపీఎల్ ఉచిత ప్రసారాలను ప్రకటించటంతో ప్రకంపనలు మెుదలయ్యాయి.

జూమ్ ఉద్యోగుల కోత..
ప్రస్తుతం ఆర్థికంగా పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో అమెరికా కంపెనీ Zoom తన ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దాదాపు 1300 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. వీటికి తోడు కంపెనీ సీఈవో తన జీతంలో దాదాపు 98 శాతం కోతను ఎదుర్కోనున్నట్లు ఇటీవల వెల్లడైంది. దీనికి తోడు బోనస్ సైతం నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది.

Ebay తొలగింపులు..
తొలగింపుల వేడి కొనసాగుతున్న తరుణంలో అమెరికాకు చెందిన ఈ-కామర్స్ సంస్థ ఈబే సైతం తన ఉద్యోగులను తొలగిస్తున్నట్లు రెండు రోజుల కిందట ప్రకటించింది. కంపెనీ తీసుకున్న ఈ తాజా నిర్ణయం కారణంగా దాదాపు 4 శాతం మంది ఉద్యోగులు అంటే 500 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. గడచిన కొన్ని నెలల నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో జామీ ఇయానోన్ వెల్లడించారు.

టిక్ టాక్..
మూడేళ్ల కిందట ఇండియాలో చైనాకు చెందిన టిక్ టాక్ ను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తనకు భారత్ లో ఉన్న మెుత్తం ఉద్యోగులను కంపెనీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో మిగిలిన 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చినట్లు వెల్లడైంది. 2020 చివరిలో ప్రపంచ వ్యాప్తంగా సేల్స్ సపోర్ట్ కోసం ఇండియాలో రిమోట్ హబ్ ఏర్పాటు చేసింది. తాజాగా వారిని సైతం తొలగించాలని నిర్ణయం తీసుకోవటంతో ఈ చర్చ వచ్చిందని కంపెనీ తెలిసింది.


Click it and Unblock the Notifications