వ్యాపారులకు బ్యాడ్ న్యూస్.. భారత్ వస్తువులపై 12.5% టాక్స్ వేయడానికి ట్రంప్ ఎందుకు రెడీ అయ్యారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన మార్కు ట్రేడ్ వార్‌కు తెరలేపారు. భారత వ్యాపారులకు, ముఖ్యంగా అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం ఒక గట్టి షాక్ ఇచ్చింది. భారత్, చైనాతో పాటు మరికొన్ని దేశాల నుండి వచ్చే వస్తువులపై ఏకంగా 12.5 శాతం దిగుమతి సుంకాలను (Import Duties) విధించాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. అసలు అమెరికా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చాలా సింపుల్‌గా చూద్దాం.

అసలు గొడవ ఏంటి?
అమెరికా ప్రభుత్వం తాజాగా సప్లై చైన్స్‌లో 'ఫోర్స్డ్ లేబర్' (వెట్టి చాకిరీ లేదా బలవంతపు శ్రమ) పై ఒక పెద్ద విచారణ జరిపింది. కొన్ని దేశాల్లో కార్మికులను సరైన పద్ధతిలో చూసుకోవడం లేదని, తక్కువ జీతాలు ఇస్తూ గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని అమెరికా వాదిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తయారయ్యే వస్తువులు తక్కువ ధరకే మార్కెట్లోకి వస్తాయని, దీనివల్ల అమెరికాలో ఉన్న లోకల్ కంపెనీలు, కార్మికులు నష్టపోతున్నారని ట్రంప్ సర్కార్ అంటోంది.
అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జామీసన్ గ్రీర్ మాట్లాడుతూ.. "మా వ్యాపార భాగస్వామ్య దేశాలు ఈ ఫోర్స్డ్ లేబర్ సమస్యను పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు. దీనివల్ల అమెరికా కార్మికులు నష్టపోతున్నారు. ఈ వివక్షను మేము ఇక ఎంతమాత్రం సహించం" అని గట్టిగానే చెప్పారు. అందుకే అమెరికా ఇండస్ట్రీలను కాపాడుకోవడానికి, అక్కడ ఉద్యోగాలను రక్షించుకోవడానికి ఈ కొత్త పన్నుల బాదుడు మొదలుపెట్టారు.
ఎవరెవరిపై ఎంత శాతం పన్ను?
ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త ప్రపోజల్ ప్రకారం దేశాలను రెండు కేటగిరీలుగా విభజించారు..
- 12.5% పన్ను: భారత్, చైనా, జపాన్, సౌత్ కొరియా, బ్రెజిల్, స్విట్జర్లాండ్ దేశాల నుండి వచ్చే వస్తువులపై ఈ గరిష్ట పన్ను పడనుంది.
- 10% పన్ను: కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, తైవాన్ వంటి దేశాల వస్తువులపై 10 శాతం పన్ను విధించనున్నారు.
ఈసారి లీగల్ రూట్‌లో..
గతంలో కూడా ట్రంప్ తన ఎమర్జెన్సీ పవర్స్ ఉపయోగించి ఇలాంటి పన్నులు వేశారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టేసింది. దాంతో ఈసారి ట్రంప్ సర్కార్ రూట్ మార్చింది. కోర్టుల్లో ఎలాంటి ఇబ్బంది రాకూడదని 'సెక్షన్ 301' అనే సాంప్రదాయ చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. ఇది కొంచెం లేట్ అయినా.. కోర్టుల్లో గట్టిగా నిలబడుతుందని వైట్ హౌస్ నమ్ముతోంది.
ప్రస్తుతానికి ఈ పన్నులపై జూలై 6 లోగా రాతపూర్వక అభిప్రాయాలు చెప్పాలని అమెరికా ట్రేడ్ ఆఫీస్ కోరింది. జూలై 7 నుండి దీనిపై పబ్లిక్ హియరింగ్స్ కూడా జరుగుతాయి. అటు జూలైలో పాత పన్నుల గడువు ముగుస్తుండటంతో, గ్యాప్ లేకుండా ఈ కొత్త పన్నులను అమలు చేయాలని ట్రంప్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో, మన ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి!


Click it and Unblock the Notifications