వాహనదారులకు బిగ్ షాక్.. పెట్రోల్ బంకుల్లో యూపీఐ బంద్.. ఓన్లీ క్యాష్ అంటున్న యజమానులు..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే ఏ ప్రతిపాదననైనా వ్యాపారుల ప్రతినిధి సంస్థ 'ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ' (CTI) తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకవేళ రూ. 2,000 దాటిన యుపిఐ చెల్లింపులపై ఎమ్‌డిఆర్ విధిస్తే, పెట్రోల్ పంప్ ఆపరేటర్లు రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన డిజిటల్ చెల్లింపులను స్వీకరించడం పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని సిటిఐ హెచ్చరించింది.
ఢిల్లీలోని చాందినీ చౌక్, కన్నాట్ ప్లేస్, సదర్ బజార్, లజ్‌పత్ నగర్, కరోల్ బాగ్ వంటి ప్రధాన వ్యాపార కేంద్రాలలో 70 శాతానికి పైగా వ్యాపారులు యుపిఐని ఉపయోగిస్తున్నారని, ఈ రకమైన రుసుములు విధిస్తే వ్యాపారులు, వినియోగదారులు తిరిగి నగదు (Cash) లావాదేవీల వైపు మళ్లే ప్రమాదం ఉందని సిటిఐ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై మాట్లాడిన సిటిఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్.. పెట్రోల్ పంప్ ఆపరేటర్లు ఇప్పటికే లీటరు ఇంధనంపై కేవలం రూ. 3 నుండి రూ. 4 స్వల్ప మార్జిన్‌తో మాత్రమే పనిచేస్తున్నారని వెల్లడించారు. సాధారణంగా ఒక కారులో ఇంధనం నింపడానికి రూ. 3,000 నుండి రూ. 5,000 వరకు, అదే ట్రక్కుల విషయానికి వస్తే రూ. 10,000 దాటి బిల్లు అవుతుందని, దీనివల్ల పెట్రోల్ పంపులలో జరిగే చెల్లింపులలో ఎక్కువ భాగం రూ. 2,000 పరిమితిని దాటి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై పడే 0.8% నుండి 1% ఎమ్‌డిఆర్ ఛార్జీల వల్ల ఆపరేటర్లు ఇప్పటికే నష్టపోతున్నారని, ఒకవేళ యుపిఐపై కూడా 1% ఎమ్‌డిఆర్ విధిస్తే వారి లాభ మార్జిన్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి నష్టాల్లోకి నెట్టబడతారని ఆయన వివరించారు. ఈ పరిస్థితి వస్తే రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యుపిఐ చెల్లింపులు స్వీకరించబడవని నోటీసు బోర్డులు పెట్టడం తప్ప ఆపరేటర్లకు వేరే మార్గం ఉండదని హెచ్చరించారు.
సిటిఐ ప్రధాన కార్యదర్శులు గుర్మీత్ అరోరా, రమేష్ అహుజా మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ రుసుమును వ్యాపారుల నుండే వసూలు చేస్తామని చెప్పినప్పటికీ, చివరికి ఆ భారం ఏదో ఒక రూపంలో వినియోగదారులపైనే పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవేట్ రవాణాదారులు మరియు రోజువారీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు.
డిజిటల్ ఇండియా లక్ష్య దెబ్బతినకుండా ఉండాలంటే యుపిఐ, రూపే (RuPay) చెల్లింపులను ఎమ్‌డిఆర్ పరిధి నుండి పూర్తిగా మినహాయించాలని సిటిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వ్యాపారులపై ఇటువంటి అదనపు ఛార్జీలు మోపితే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని బ్రిజేష్ గోయల్ స్పష్టం చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

