ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాతో భారత వాణిజ్య సంబంధాలు క్రమేపీ బలపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబరు మధ్య ఇండియా అతిపెద్ద ట్రేడ్ పార్టనర్ గా US ఉద్భవించింది. ఇక దాని తరువాత పొరుగు దేశం చైనా రెండో స్థానంలో నిలిచింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితితో పాటు ఎగుమతులు మరియు దిగుమతుల్లో భారీ క్షీణత ఏర్పడింది. అయినప్పటికీ భారత్ కు అమెరికా ఆతిపెద్ద వాణిజ్య బాగస్వామిగా అవతరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 11.3 శాతం మేర క్షీణించి 59.67 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వ తాత్కాలిక డేటా వెల్లడించింది.

2023 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అమెరికాకు ఎగుమతులు 38.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాదిలో 41.49 బిలియన్ డాలర్లతో పోలిస్తే
ఎక్స్ పోర్ట్స్ తగ్గాయి. దిగుమతుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాది మొదటి 6 నెలల్లో 25.79 బిలియన్ డాలర్ల మేర ఇండియా ఇంపోర్ట్ చేసుకోగా.. ఈసారి ఇది 21.39 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
ఇక భారత్, చైనాల మధ్య వాణిజ్యం కూడా 3.56 శాతం తగ్గి 58.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో చైనాకు ఎగుమతులు 7.84 బిలియన్ డాలర్ల నుండి స్వల్పంగా 7.74 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు అంతకు ముందు ఏడాది 52.42 బిలియన్ డాలర్లు కాగా.. ఇప్పుడు 50.47 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
గ్లోబల్ డిమాండ్ లో మందగమనం కారణంగా ఇండియా, అమెరికా మధ్య ఎగుమతులు మరియు దిగుమతులు క్షీణిస్తున్నాయి. వృద్ధి రేటు త్వరలోనే సానుకూలంగా మారుతుందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరుగుతుందని CII జాతీయ కమిటీ అద్యక్షులు సంజయ్ బుధియా గతంలోనే అంచనా వేశారు.


Click it and Unblock the Notifications