దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ఇప్పుడు బడ్జెట్ (Budget 2026) వైపు ఆశగా చూస్తున్నారు. ముఖ్యంగా మన దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగంలో ఈసారి భారీ మార్పులు రాబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటివరకు "ఎక్కువ పంట పండించాలి" అనే దిశగా సాగిన అడుగులు, ఇప్పుడు "నాణ్యమైన, పోషకాలున్న పంటలు పండించాలి" అనే వైపు మళ్లుతున్నాయి.

పురుగుమందులపై GST తగ్గింపు?
ప్రస్తుతం వ్యవసాయంలో వాడుతున్న పురుగుమందులపై 18% GST విధిస్తున్నారు. దీనివల్ల రైతులకు సాగు ఖర్చు భారంగా మారుతోంది. ధనుకా అగ్రిటెక్ వంటి సంస్థల నిపుణులు ఏమంటున్నారంటే.. "పురుగు మందులు అనేవి విలాస వస్తువులు కాదు, అవి పంటకు ఇచ్చే మందులు (Plant Medicines). కాబట్టి వీటిపై GSTని 18% నుండి 5% కి తగ్గించాలి". ఇప్పటికే బయో- పెస్టిసైడ్స్ పై పన్ను తగ్గించిన ప్రభుత్వం.. ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో సాధారణ పురుగుమందులపై కూడా ఊరటనిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.
'హిడెన్ హంగర్' కు చెక్.. బయోఫోర్టిఫైడ్ విత్తనాలు!
మనం కడుపు నిండా తింటున్నాం. కానీ, మన శరీరానికి అందాల్సిన జింక్, ఐరన్ వంటి పోషకాలు అందడం లేదు. దీన్నే 'హిడెన్ హంగర్' అంటారు. మన దేశంలో పోషకాహార సమస్యలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. దీనికి సరైన సొల్యూషన్ వ్యవసాయంలోనే ఉందంటున్నారు నిపుణులు. బెటర్ న్యూట్రిషన్ వంటి స్టార్టప్ ప్రతినిధులు ఈ బడ్జెట్ లో ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కేవలం పంట దిగుబడిని పెంచడమే కాకుండా, పోషకాలు ఎక్కువగా ఉండే 'బయోఫోర్టిఫైడ్' విత్తనాలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రైతులకు కూడా మార్కెట్ లో మంచి ధర లభిస్తుంది.
పరిశోధనలకు (R&D) పెద్దపీట వేయాల్సిందే!
భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమైనా, అగ్రి రీసెర్చ్ కోసం మనం ఖర్చు చేస్తున్నది GDP లో కేవలం 0.7% మాత్రమే. చైనా, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కాబట్టి ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో వ్యవసాయ పరిశోధనలకు నిధులు పెంచాలని, ప్రైవేట్ రంగంలో పరిశోధనలు చేసే వారికి పన్ను మినహాయింపులు ఇవ్వాలని ఇండస్ట్రీ లీడర్లు కోరుతున్నారు.
ఎరువుల రంగంలో స్వయం సమృద్ధి
భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయ రంగంలో కొంత వెనుకబడే ఉన్నాం. మనం ఇప్పటికీ ఎరువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం. ఈ బడ్జెట్ లో 'ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్' (PLI) స్కీమ్ ను బయో-ఫెర్టిలైజర్ రంగానికి కూడా విస్తరించాలని డిమాండ్ వినిపిస్తోంది. దీనివల్ల మన దేశంలోనే ఎరువుల తయారీ పెరుగుతుంది, ఫలితంగా ప్రభుత్వంపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుంది.
ఏదేమైనా బడ్జెట్ అనేది కేవలం అంకెలకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది భారతీయ వ్యవసాయాన్ని మరింత ఆధునికంగా, లాభదాయకంగా మార్చే ఒక గొప్ప అవకాశం. ప్రభుత్వం రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీని అందిస్తే, రాబోయే రోజుల్లో మన దేశం ప్రపంచానికే 'పోషకాహార గని'గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు .


Click it and Unblock the Notifications