బడ్జెట్ మంత్రం: ఉత్సాహంతో ఉరకలు వేస్తోన్న స్టాక్ మార్కెట్
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఇంకాస్సేపట్లో లోక్‌సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. కొద్దిసేపటి కిందటే ఆమె బహీఖాతాను తీసుకుని నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం అయ్యారు. బడ్జెట్ హైలైట్స్‌కు గురించి ఆయనకు వివరించారు. అనంతరం అక్కడి నుంచి ఆమె నేరుగా పార్లమెంట్‌కు చేరుకున్నారు.
11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. సుమారు రెండు గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రైల్వే బడ్జెట్‌ను కూడా నిర్మల సీతారామనే ప్రవేశపెడతారు. ఇదివరకు సార్వత్రిక బడ్జెట్, రైల్వే బడ్జెట్ వేర్వేరుగా కొనసాగాయి. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఏర్పాటైన తరువాత ఈ రెండింటినీ విలీనం చేసింది. బడ్జెట్ ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గం ఈ ఉదయం సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి అధ్యక్షత వహిస్తారు.

బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదంచడం కోసమే కేబినెట్‌ను సమావేశపరిచారు. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన హైలైట్స్‌ను ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం, ఇతర మంత్రులకు సర్కులేట్ చేసింది. బడ్జెట్ హైలైట్స్‌కు సంబంధించిన వివరాలను మంత్రివర్గ సమావేశంలో నిర్మల సీతారామన్ ప్రస్తావిస్తారు. క్లుప్తంగా వాటి గురించి వివరిస్తారు. ఆమోదం పొందిన అనంతరం సభ ముందుంచుతారు.
కాగా- బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో భారీగా పుంజుకొంది. స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ సానుకూల ప్రభావాన్ని చూపించింది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కళకళలాడుతున్నాయి. ఈ రెండూ లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ గానీ, నిఫ్టీ గానీ భారీగా లాభపడ్డాయి. ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ లాభాలతో కొనసాగుతోంది. బడ్జెట్ ఇచ్చిన ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.

సెన్సెక్స్ భారీగా లాభపడింది.సోమవారం నాటి ట్రేడింగ్‌తో పోల్చుకుంటే 582.85 పాయింట్ల లాభంతో ఇవ్వాళ్టి ట్రేడింగ్ ఆరంభమైంది. 58,597.02 పాయింట్లతో ట్రేడింగ్ మొదలైంది. అటు నిఫ్టీ కూడా లాభపడింది. 156.20 పాయింట్ల అధికంగా ట్రేడింగ్‌ను మొదలు పెట్టింది. 17,496.05 పాయింట్ల వద్ద దాని ట్రేడింగ్ ఆరంభమైంది. అరగంటలోనే ఈ రెండూ పరుగులు పెట్టాయి. 9:30 గంటలకు ట్రేడింగ్ సెన్సెక్స్ 686.43 పాయింట్లు, నిఫ్టీ 173.80 పాయింట్లకు చేరింది.


Click it and Unblock the Notifications