మే నెలలో డబుల్ డిజిట్ చేరుకున్న నిరుద్యోగిత రేటు
కరోనా మహమ్మారి దెబ్బకు చాలామంది ఉద్యోగాలు పోయాయి. గత ఏడాది కరోనా కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు పోగా, మరికొంతమందికి వేతనాల్లో కోత పడింది. ఆ తర్వాత కుదురుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ దెబ్బతీసింది. దీంతో మే నెలలో నిరుద్యోగిత రేటు డబుల్ డిజిట్‌కు చేరుకుంది. కరోనా లాక్ డౌన్, కఠిన నిబంధనల వల్ల దాదాపు 10 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే ఇది అత్యధికం.

మరోసారి నిరుద్యోగిత డబుల్ డిజిట్
దేశంలో నిరుద్యోగిత రేటు క్రమంగా డబుల్ డిజిట్స్ దిశగా పరుగు తీస్తోంది. అంతకుముందు సుదీర్ఘ లాక్ డౌన్ విధించినప్పుడు కూడా డబుల్ డిజిట్ నిరుద్యోగిత రేటు నమోదయింది. ఈ నెల 23వ తేదీతో ముగిసిన వారానికి నిరుద్యోగిత 14.7 శాతానికి చేరుతుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMEI) వెల్లడించింది. గత ఏడాది మాదిరిగా పూర్తిస్థాయిలో ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్ అమలు కాకున్నా రవాణాపై ఆంక్షలు విధించడం ప్రతికూల ఫలితాలకు దారి తీస్తోందని తెలిపింది.

అక్కడ నిరుద్యోగం ఎక్కువ
ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి నిరుద్యోగిత రేటు 8.7 శాతానికి, 16వ తేదీతో ముగిసిన వారానికి 14.3 శాతానికి పెరిగింది. కానీ, గత నెలలో అది 7.97 శాతంగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగిత రేటు పెరిగిందని CMEI తెలిపింది. అయితే గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు ఎక్కువగా పెరుగుతోంది.

నిరుద్యోగిత రేటు పెరిగిందిలా
ఈ నెల ఆరో తేదీ నాటికి సగటున నిరుద్యోగిత రేటు 10.2 శాతానికి చేరుకుంది. ఇది నికరంగా పెరుగుతూ వచ్చింది. మే 20వ తేదీ నాటికి 12 శాతం, 23 నాటికి 12.7 శాతంగా నమోదైందని CMEI తెలిపింది. అధిక సంఖ్యలో కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడం వల్ల నిరుద్యోగిత పెరుగుతున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications