FDI: UAEతో భారత్ బంధం పటిష్ఠం.. ఏడాదిలో ఏడు నుంచి మూడో స్థానానికి..
FDI: ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో విదేశీ పెట్టుబడుల ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. వివిధ దేశాల నుంచి ఇండియాలోకి భారీగా FDIలు తరలి వస్తుంటాయి. గత ఏడాది మేలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మనదేశం సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేసింది. తద్వారా 2022-23 మధ్యకాలంలో ఇండియాలో నాల్గవ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఆదేశం ఉద్భవించింది.
గత ఆర్థిక సంవత్సరంలో UAE నుంచి ఇండియాకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) మూడు రెట్లు పెరిగాయి. 2021-22లో 1.03 బిలియన్లుగా ఉన్న ఈ మొత్తం 3.35 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) డేటా చెబుతోంది. 2021-22లో ఏడవ స్థానంలో ఉన్న UAE.. 2022-23లో నాల్గవ స్థానానికి చేరినట్లు తెలిపింది.

FY23లో 17.2 బిలియన్ల పెట్టుబడితో భారతదేశంలో సింగపూర్ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. మారిషస్ 6.1 బిలియన్ డాలర్లతో మరియు US 6 బిలియన్ డాలర్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మన దేశంలో UAE పెట్టుబడులు ప్రధానంగా సేవలు, సముద్ర రవాణా, విద్యుత్ మరియు నిర్మాణ రంగాల్లో ఉన్నాయి.
"ఇండియా మరియు UAE మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడి సహకారం వేగంగా బలోపేతం కావడానికి పలు విధాన సంస్కరణలు కారణమని చెప్పవచ్చు" అని శార్దూల్ అమర్‌చంద్ మంగళదాస్ & కో భాగస్వామి రుద్ర కుమార్ పాండే అభిప్రాయపడ్డారు. మే 1, 2022 నుంచి అమలులోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై ఇరు దేశాలు సంతకం చేయడం ఇందుకు ప్రధాన కారణంగా తెలిపారు.


Click it and Unblock the Notifications