Telangana: తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తాజా కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుందని ఆరోగ్య, ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో భూమి ఉన్న పేద కుటుంబాలకు ఇల్లు కట్టుకోలేని 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.12,000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో దళిత బంధు రెండవ దశ, పోడు భూములతో పాటు ఇతర ప్రభుత్వ పథకాల గురించి చర్చించినట్లు వెల్లడించారు.

గృహ లక్ష్మి..
రాష్ట్రంలో గృహలక్ష్మి స్కీమ్ కింద 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లను వినియోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సొంత భూమి ఉన్న వారికి కుటుంబంలోని మహిళల పేరు మీద ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు ఆర్థిక సాయంగా అందిస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ సొమ్ము నేరుగా ఖాతాల్లో జమచేస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

దళిత బంధు ఫేజ్-2..
తెలంగాణలో చాలా ప్రజాదరణ పొందుతున్న పథకాల్లో దళిత బంధు ఒకటి. అయితే దీనిని రెండో విడతలో 1.30 లక్షల మంది లబ్ధిదారులకు అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 100 శాతం లబ్ధిదారులు పథకం ప్రయోజనాలను పొందారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఫేజ్-2 కింద అర్హులకు సాయం అందుతుందని వెల్లడించారు. రెండో దశ పనులు వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలసి ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని తెలిపారు.

పోడు భూములు..
గిరిజన సామాజిక వర్గానికి చెందిన 1,55,393 మందికి 4 లక్షల ఎకరాల పోడు భూములను పంపిణీ చేయాలని తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించినట్లు హరీష్ రావు తెలిపారు. దీనికింద ఇప్పటి వరకు గుర్తింబడిన వ్యక్తుల పత్రాలు ముద్రించబడ్డాయని.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు.

అంబేద్కర్ విగ్రహం..
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ నిర్మాణం పూర్తయిందని హరీష్ రావు వెల్లడించారు. దీనిని ఏప్రిల్ 14న ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని తర్వాత నెలరోజుల్లోనే నూతన సచివాలయ భవనం, అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభం జరుగుతాయని స్పష్టం చేశారు.

గొర్రెల పంపిణీ..
గొర్రెల పంపిణీ పథకం రెండో విడతలో 7,31,000 మంది లబ్ధిదారులను గుర్తించామని మంత్రి తెలిపారు. వీరిలో 50 శాతం మందికి ఇప్పటికే గొర్రెలు అందాయని హరీశ్ అన్నారు. మిగిలిన పంపిణీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కేబినెట్ కమిటీ రూ.4,463 కోట్లు మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. పారదర్శకంగా ఈ స్కీమ్ అమలును జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని చెప్పారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీని ఏప్రిల్‌లో ప్రారంభించి ఆగస్టు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇళ్ల క్రమబద్ధీకరణ..
GO 58, 59 ప్రకారం రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని హరీష్ వెల్లడించారు. ఇప్పటి వరకు జీవో 58 కింద 1,45,668 మంది దరఖాస్తు చేసుకోగా.. జీవో 59 కింద 42,000 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.

కాశీ, శబరిమలలో అతిథి గృహాలు..
తెలంగాణ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా హిందూ సమాజం కోసం ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, కేరళలోని శబరిమలలో అతిథి గృహాలను నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు. కాశీలో నిర్మించే భవనానికి ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చిస్తోందని తెలపగా.. కేరళలోని శబరిమలలో వసతి గృహాల నిర్మాణానికి రూ.27 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications