రష్యాతో ఆయిల్ డీల్ ఆపకపోతే మళ్లీ అదనపు సుంకాల బాదుడు తప్పదు.. భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌కు గట్టి హెచ్చరిక చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో న్యూఢిల్లీ సహకరించకపోతే.. భారతదేశం నుంచి జరిగే దిగుమతులపై అదనపు సుంకాలు విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ కథనాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ సోమవారం ప్రచురించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకాలను పెంచే అంశంపై కూడా అమెరికా వెనుకాడదని Trump సంకేతాలు ఇచ్చారు.
ట్రంప్ సర్కారు గత సంవత్సరం భారత వస్తువులపై సుంకాలను 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోందన్న కారణాన్ని చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. రష్యా చమురు సమస్యపై భారత్ సహాయం చేయకపోతే.. మేము టారిఫ్‌లను ఇంకా పెంచవచ్చని హెచ్చరించారు.

అయితే, భారతదేశం ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించిందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. వాళ్లు నన్ను సంతోషపెట్టాలని కోరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం వారికి ముఖ్యం. వారు వ్యాపారం చేస్తారు, కానీ మేము కావాలంటే చాలా వేగంగా సుంకాలను పెంచగలమని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు భారత్‌పై ఒత్తిడి పెంచే విధంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కొన్ని నెలల క్రితం ప్రధాని మోదీ తనకు రష్యా చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో కూడా భారతదేశం ఇక చమురు కొనడం లేదని ఆయన వ్యాఖ్యానించిన విషయం విదితమే అయితే, ఈ అంశంపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఇంకా అధికారిక స్పందన రాలేదు.
ఈ పరిణామాలన్నీ భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల సమయంలో జరగడం గమనార్హం. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు చురుగ్గా కొనసాగుతున్నాయి. వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకారం.. న్యూఢిల్లీ, వాషింగ్టన్ ప్రతినిధులు ఒప్పందాన్నివీలయినంత త్వరగా పూర్తిచేయాలని ఆశిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో మెరుగైన అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 191 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యంతో ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. ఈ దిశగా ఇప్పటివరకు ఆరు రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. అయితే ఈ సుంకాల అంశం ఈ చర్చలకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిగిందన్న క్రెమ్లిన్ వాదనలను ట్రంప్ మరోసారి ఖండించారు. అమెరికా జాతీయ భద్రతా అధికారులు అలాంటి దాడి జరగలేదని నిర్ధారించారని ఆయన తెలిపారు. ఆ దాడి నిజంగా జరిగిందని నేను నమ్మనని ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు తిరిగి వెళ్తూ ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ కూడా ఆ ఆరోపణలను ఖండించగా, ఈ అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications