Trump Tarrifs: ఇంక మారవా? ట్రంప్ కొత్త సుంకాల ప్లానింగ్! దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే..
భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవల కాలంలో మరింత ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా సుంకాలు (టారిఫ్‌లు) విధించేందుకు సంకేతాలు ఇవ్వడం భారతీయ ఎగుమతిదారులలో ఆందోళన పెంచుతోంది. ఈ పరిణామం వెనుక కారణాలు ఏమిటి? భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎంతవరకు ఉండవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.

బియ్యం 'డంపింగ్'..
అమెరికన్ రైతులకు 12 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ప్రకటించేందుకు నిర్వహించిన వైట్‌హౌస్ సమావేశంలో.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, థాయ్‌లాండ్, చైనా వంటి దేశాలు తక్కువ ధరకు బియ్యాన్ని అమెరికా మార్కెట్‌లో 'డంప్' చేయడం వల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుంకాల (Trump Tarrifs) అవసరాన్ని నొక్కి చెబుతూ, లూసియానాలోని కెన్నెడీ రైస్ మిల్స్ సీఈఓ మెరిల్ కెన్నెడీ, "భారత్ వంటి దేశాల నుంచి వచ్చే చౌకైన బియ్యం తమ మార్కెట్‌ను దెబ్బతీస్తోందని, దేశీయ ధరలను తగ్గిస్తోందని" ట్రంప్‌కు వివరించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, "వారు మోసం చేస్తున్నారు.. దీనిని నేను సరిచేస్తాను" అని హామీ ఇచ్చారు.
సుంకాలతోనే సమస్యకు పరిష్కారం అంటున్న ట్రంప్
భారత బియ్యం అమెరికా మార్కెట్‌లో 'డంప్' అవుతున్న విధానంపై ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "వారు (భారత్) డంపింగ్ చేయకూడదు. ఈ సమస్యను టారిఫ్స్ ద్వారా రెండు నిమిషాల్లో పరిష్కరించవచ్చు" అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే వాణిజ్య అడ్డంకులు, రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా ట్రంప్ భారత వస్తువులపై 50% సుంకాలను విధించారు. ఇప్పుడు బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించే ఆలోచన.. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం (BTA) చర్చలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
భారత ఎగుమతులపై ప్రభావం ఎలా ఉంటుంది?
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు అలాగే ఎగుమతిదారు కూడా. బాస్మతి బియ్యం, సోనా మసూరి వంటి రకాలు అమెరికా మార్కెట్‌లో ఎన్నారైలలో, స్థానికులలో మంచి డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. అయితే అమెరికాకు భారత్ ఎగుమతి చేసే మొత్తం బియ్యం వాటా (ప్రధానంగా బాస్మతి) చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ, Trump Tarrifs అమలులోకి వస్తే.. ధరలు పెరిగే అవకాశం ఉంది.
సుంకాలు భారమైనప్పుడు భారతీయ బియ్యం ధర అమెరికా మార్కెట్‌లో పెరుగుతుంది. దీంతో వినియోగదారులను కోల్పోయి, పాకిస్థాన్, వియత్నాం వంటి పోటీ దేశాలకు లాభం చేకూరవచ్చు. ఎగుమతిదారులు సుంకాల భారాన్ని తగ్గించడానికి ధరలు తగ్గించాల్సి వస్తుంది లేదా కొత్త మార్కెట్ల కోసం వెతకాల్సి వస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాలతో సహా బియ్యం పరిశ్రమకు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది.
అర్థం కాని ట్రంప్..
ఏదేమైనా ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ అర్థం అయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిడి వంటి అంశాల మధ్య కూడా అమెరికా రైతులకు మద్దతుగా ట్రంప్ తీసుకుంటున్న ఈ కఠిన వైఖరి ప్రపంచ వాణిజ్యానికి ఒక సవాలుగా మారింది. ఈ వారం భారత్‌లో జరగబోయే వాణిజ్య చర్చల్లో ఈ టారిఫ్స్ అంశం కీలక పాత్ర పోషించనుంది. ఈ చర్చలు సత్ఫలితాలను ఇస్తాయా లేదా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications