Trump News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ వాణిజ్య విధానాల్లో రాబోయే మార్పు గురించి సూచనప్రాయంగా కొన్ని కామెంట్స్ చేశారు. మోదీ సర్కార్ అమెరికన్ వస్తువులపై సుంకాలను తగ్గించవచ్చని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఒక వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియా సుంకాలను గణనీయంగా తగ్గించవచ్చని తాను నమ్ముతున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ 2 నుంచి ఇండియా అమెరికా వస్తువులపై వసూలు చేసే సుంకాలను తాము కూడా వసూలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను హైలైట్ చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య కొత్త సుంకం నిర్మాణం అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఈ చర్య భారతదేశ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సమతుల్యత, ఆర్థిక మార్కెట్లపై గణనీయమైన ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
భారత్ ఇలాంటి తరుణంలో అమెరికన్ దిగుమతులపై సుంకాలను తగ్గిస్తే, వ్యవసాయం, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి దేశీయ పరిశ్రమలు తీవ్ర పోటీని ఎదుర్కోవలసి ఉంటుందని ఇండియన్ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా సుంకాలు కీలకమైన ఆదాయ వనరుగా ఉన్నందున, తగ్గింపు అమెరికాతో భారతదేశ వాణిజ్య మిగులును తగ్గించటమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేయనుందనే ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇది జరగకపోతే అమెరికా మాత్రం మిత్రదేశమైనప్పటికీ పరస్పర సుంకాలను విధించటంలో వెనక్కి తగ్గేదేలేదని ట్రంప్ మోదీ పర్యటన సమయంలోనే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

ఇండియా నుంచి అమెరికాకు భారీగా ఎగుమతి అయ్యే మందులు, టెక్స్‌టైల్స్, రసాయనాలు, లోహాలు ట్రంప్ చర్యలతో ఒత్తిడికి గురయ్యే రంగాలుగా ఉన్నాయి. ఇది పరోక్షంగా రూపాయి మారకపు విలువపై కూడా ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎగుమతుల్లో తగ్గుదల, దిగుమతుల పెరుగుదల రూపాయిని బలహీనపరచవచ్చనే ఆందోళనలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం:
ఆత్మనిర్భరతపై ప్రభావం: అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గితే, భారతీయ పరిశ్రమలు విదేశీ పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా వ్యవసాయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలపై ప్రభావం చూపవచ్చు. ఈ రంగాలలో విదేశీ ఉత్పత్తులు భారతీయ మార్కెట్లోకి తక్కువ ధరలతో ప్రవేశించవచ్చు. ఇది స్థానిక తయారీదారులకు సవాలుగా మారుతుంది.
వాణిజ్య లోటు: సుంకాల తగ్గింపుతో అమెరికా నుండి దిగుమతులు పెరుగుతాయి, ఇది భారత వాణిజ్య లోటును పెంచే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక సమతుల్యతపై ప్రభావం చూపవచ్చు.
ఆర్థిక స్థిరత్వం: సుంకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోతే, ఇది ఆర్థిక లోటును పెంచే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ వ్యయాలపై ప్రభావం చూపవచ్చు.


Click it and Unblock the Notifications