టెలికం రంగంలో ఉచిత కాలింగ్, చౌక డేటా సేవలకు తెరపడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రెండింటికీ కనీస ఛార్జీలను నిర్ణయించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మంగళవారం ట్రాయ్ కనీస ఛార్జీలపై చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై సంబంధిత వర్గాల నుంచి జనవరి 17వ తేదీలోగా అభిప్రాయాలను కోరింది.

కనీస ఛార్జీలు నిర్ణయించాలి
2016లో ముఖేష్ అంబానీకి చెందిన జియో రాకతో టెలికం రంగంలో టారిఫ్, చౌక డేటా యుద్ధం మరింత తీవ్రమైన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరలకే ఇవ్వడం వల్ల కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జియో రాకతో ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. దీంతో టెలికాం సేవలపై కనీస చార్జీల్ని నిర్ణయించాలని కొన్ని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ట్రాయ్ తొలుత నిరాకరించింది. కానీ ఆ తర్వాత యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు కనీస ఛార్జీలు వడ్డించే ప్రతిపాదనలకు రంగం సిద్ధమైంది.

కొత్త ఆఫరేటర్లకు హఠాత్తుగా లాభాలు వచ్చి పడకుండా..
ఇటు టెల్కోలు, అటు కస్టమర్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు టారిఫ్స్ విషయంలో ట్రాయ్ జోక్యం చేసుకోవాల్సిన అవసరంపై, మొబైల్ సర్వీసెస్ కనీస ఛార్జీలను నియంత్రించడంపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను కోరింది. ఒకవేళ కనీస ఛార్జీలు నిర్ణయించవలసి వస్తే కొత్త ఆపరేటర్లకు అకస్మాత్తుగా లాభాలు వచ్చి పడకుండా అనుసరించతగిన విధానాలపై అభిప్రాయాలను ఆహ్వానించింది. జనవరి 17వ తేదీ వరకు అభిప్రాయాలు చెప్పవచ్చు. వీటిపై కౌంటర్ - కామెంట్స్ సమర్పించేందుకు చివరి తేదీ జనవరి 31.

టెలికం రంగం ఆరోగ్యంగా ఉండాలి
టెలికం రంగంలో వేగంగా మారే టెక్నాలజీలను అందుకోవాలంటే భారీ పెట్టుబడులు కావాలని, ఎకానమీలో వివిధ రంగాలకు కీలకంగా మారిన టెలికం రంగం ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని, టెలికం రంగ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత వర్గాలంతా చర్చించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.

కనీస ఛార్జీల విధానం అమల్లోకి వస్తే..
కనీస టారిఫ్, డేటా ఛార్జీలపై ట్రాయ్ అభిప్రాయ సేకరణ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం టారిఫ్స్ విషయంలో టెల్కోలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించిన వారం రోజుల్లో ట్రాయ్‌కు సమాచారం ఇవ్వాలి. కాబట్టి కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెల్కోలు పోటాపోటీగా ఉచిత, చౌక ప్లాన్స్ అందించాయి. కనీస ఛార్జీల విధానం అమలులోకి వస్తే ఉచిత సేవలకు కాలం చెల్లినట్లే.


Click it and Unblock the Notifications