న్యూఢిల్లీ: ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు (IUC) తొలగించాలన్న వాదనతో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విభేదిస్తోంది. ఇది వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వంటి ఆర్థిక నష్టాల్లో ఉన్న సంస్థలకు రిలీఫ్ అని చెప్పవచ్చు. జీరో IUCకి ట్రాయ్ మంగళవారం నో చెప్పింది. మరో ఏడాది పాటు అంటే జనవరి 1, 2021 వరకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. దీంతో కస్టమర్లు మరో ఏడాది పాటు IUC భారం మోయాలి.

మరో ఏడాది పాటు IUC కొనసాగింపు
IUC ఛార్జీ ఎత్తివేతని మరో ఏడాదిపాటు వాయిదా వేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. ప్రస్తుత నిబంధన ప్రకారం ఒక వైర్‌లెస్ నెట్ వర్క్ కస్టమర్ ఇతర వైర్‌లెస్ నెట్‌వర్క్ నెంబరుకు కాల్ చేస్తే.. సదరు కస్టమర్ నెట్ వర్క్ రెండో కస్టమర్ నెట్ వర్క్‌కు ఆ కాల్ పైన నిమిషానికి 6 పైసలు చెల్లించాలి. దీనినే IUC లేదా కాల్ టెర్మినేషన్ ఛార్జీగా చెబుతారు. గతంలో నిమిషానికి 14 పైసలుగా ఉన్న ఈ ఛార్జీ 2017 అక్టోబర్ 1 నుంచి 6 పైసలకు తగ్గింది. 2020 జనవరి 1వ తేదీ నుంచి ఈ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయాలని తొలుత ప్రతిపాదించినప్పటికీ, 2020 డిసెంబరు 31 దీనిని కొనసాగిస్తున్నట్లు తాజాగా తెలిపింది.

సంక్షోభంలో ఉన్న టెలికం రంగానికి ఊరట
IUC ఛార్జీ విధానాన్ని 2020 జనవరి 1 నుంచి ఎత్తివేసే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ దీనిని 2021 జనవరి 1వ తేదీ వరకు కొనసాగించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న టెలికం రంగానికి ఇది కాస్త ఊరట అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వీటికి అయితే భారీ రిలీఫ్ అని చెబుతున్నారు.

టెల్కోలపై మరింత భారం తప్పింది..
2017 అక్టోబర్ వరకు 14 పైసలుగా ఉన్న IUC ఛార్జీలు ఆ తర్వాత 6 పైసలు అయింది. దీంతో టెల్కోలు రూ.11,000 కోట్ల మేర నష్టపోయినట్లుగా అంచనా. 6 పైసల IUCని కూడా ఎత్తివేస్తే పరిశ్రమపై మరో రూ.3,672 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రయోజనాలు, టెలికం భవిష్యత్తు దృష్ట్యా IUC స్థానంలో కొత్త బీఏకే-బిల్ అంట్ కీప్ విధానం అమలును ఏడాది పాటు వాయిదా వేసినట్లు ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ నిర్ణయాన్ని టెలికం సంస్థలు స్వాగతించాయి. IUCని పరిగణలోకి తీసుకొనే టెల్కోలు ఇటీవల ఛార్జీలను పెంచాయని, కస్టమర్లపై కొత్తగా ప్రభావం ఉండదని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications