ఇండియా ఒక అరుదైన ఘనత ను సాధించింది. వాణిజ్యంలో గత 18 ఏళ్ళ రికార్డు ను తిరగ రాసింది. 2002 తర్వాత మళ్ళీ తొలిసారి ఇండియా ఎగుమతులు ... దిగుమతుల కంటే అధికంగా నమోదు అయ్యాయి. దీంతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దేశ వాణిజ్య మిగులు (ట్రేడ్ సర్ప్లస్) సాధించింది. సాధారణంగా అయితే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఏ దేశానికైనా అత్యంత అనుకూలమైన వాతావరణం అని పండగ చేసుకుంటారు. కానీ, ప్రస్తుతం ఇండియా విషయంలో జరిగింది అలా లేకపోవటం విచారకరం. ఇండియా ఒక దిగుమతి ఆధారిత దేశం. వాణిజ్య ఎగుమతులు కూడా ఉన్నప్పటికీ మనం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడతాం. అందుకే ఇక్కడి నుంచి జరిగే ఎగుమతులకంటే కూడా దిగుమతులు అధికంగా ఉంటాయి. దీంతో వాణిజ్య లోటు ఏర్పడుతుంది. కానీ చాలా కాలం తర్వాత ... అది కూడా కరోనా వైరస్ పుణ్యమా అని తొలిసారి వాణిజ్య మిగులు లభించింది. ఇది ప్రధానంగా చైనా సహా ఇతర దేశాల నుంచి భారీ స్థాయిలో దిగుమతులను నిలిపివేయటం వల్ల జరిగిందే కానీ... మన దేశం నుంచి భారీ స్థాయిలో ఎగుమతులు జరగటం వల్ల లభించిన మిగులు కాకపోవటంతో ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నారు.

790 మిలియన్ డాలర్ల మిగులు...
ఈ ఏడాది జూన్ నెలలో ఇండియా నుంచి జరిగిన ఎగుమతులు 21.91 బిలియన్ డాలర్లు గా నమోదు అయ్యాయి. పెట్రోలియం, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, జేమ్స్ అండ్ జ్యువలరీ వంటి కీలక ఎగుమతులు డీలా పడటంతో మొత్తం ఎగుమతుల్లో 12.41% క్షీణత నమోదయ్యింది. అయితే అదే సమయంలో జూన్ నెలకు గాను ఇండియా దిగుమతులు ఏకంగా 47.59% పడిపోయి 21.11 బిలియన్ డాలర్లకు పరిమితం అయిపోయాయి. 30 కీలక దిగుమతులకు గాను 26 ఐటమ్స్ ఇంపోర్ట్స్ పడిపోవటంతో ఈ పరిణామం సంభవించింది. దీంతో దాదాపు రెండు దశాబ్దాల్లో తొలిసారి మళ్ళీ భారత్ వాణిజ్యం లో మిగులును (790 మిలియన్ డాలర్లు) సాధించింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.

అవి తప్ప అన్నీ...
గత నెలలో నిత్యావసర వస్తువులు ఐన ఫార్మస్యూటికల్స్, మెడిసినల్ వస్తువులు, పప్పు ధాన్యాలు, వెజిటబుల్ ఆయిల్స్ వంటి దిగుమతులు మాత్రం యథావిధిగా కొనసాగాయి. ఇక మన దిగుమతుల్లో ప్రధాన వాటా కలిగిన చమురు దిగుమతులు భారీగా పడిపోయాయి. అవి ఏకంగా 55.29% పతనమై 4.93 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. బంగారం దిగుమతులు అయితే మరింతగా తగ్గిపోవటం విశేషం. జూన్ మాసంలో అవి 77% పైగా తగ్గిపోయి 608 మిలియన్ డాలర్ల కు పరిమితం కావటం పరిస్థితి తీవ్రత కు అద్దం పడుతోంది. ఎలక్ట్రానిక్స్ వంటి భారీ స్థాయి వాటా కలిగిన ఐటమ్స్ కూడా గణనీయంగా ఇంపోర్ట్స్ విషయంలో నెమ్మదించాయి. దీంతో తాత్కాలికంగా దేశానికి కొంత మిగులు ఏర్పడింది. అయితే ఇది ఎంత వరకు దేశానికి మేలు చేయగలదనే సందేహాలు నెలకొన్నాయి.

కొనసాగటం కష్టమే..
ప్రస్తుతం భారత్ సాధించిన వాణిజ్య మిగులు కేవలం తాత్కాలికం మాత్రమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పైగా దిగుమతుల్లో తరుగుదల దేశ మందగమనాన్ని సూచిస్తుందని వారు చెబుతున్నారు. వినియోగదారుల నుంచి డిమాండ్ పడిపోయిందని ప్రస్తుత పరిణామం స్పష్టం చేస్తోందని అంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటె దేశంలో ఆర్థిక మందగమనం మరింత కాలం కొనసాగే పరిస్థితులు ఏర్పడతాయని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా... ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజషన్స్ (ఎఫ్ఐఈఓ) మాత్రం ఈ ఏడాది మన ఎగుమతులు 20% వరకు పడిపోతాయని అంచనా వేస్తోంది. దేశంలో రెండో విడత కరోనా వైరస్ విజృంభిస్తే అది జరుగుతుందని పేర్కొంది. కాబట్టి, ఎగుమతులు క్షీణిస్తే మళ్ళీ వాణిజ్య లోటు ఏర్పడుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.


Click it and Unblock the Notifications