IT News: టెక్ కంపెనీల్లో సీక్రెట్ నిర్ణయాలు.. టెక్కీల ఉక్కిరిబిక్కిరి.. చెప్పుకోలేక
IT Layoffs: దేశీయ ఐటీ కంపెనీల్లో బయటకు తెలియకుండా చాలా తంతు కొనసాగుతోంది. దీంతో చాలా మంది టెక్కీలు ప్రభావితం అయ్యారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది మిగిలిన టెక్ ఉద్యోగులను సైతం ఆందోళనల్లోకి నెట్టేస్తోంది.
దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ సహా మెుదలైన కంపెనీల వ్యాపారం ఆందోళనకర స్థాయిలకు దిగజారింది. కొత్త ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు లేకపోవటంతో ఉద్యోగుల తొలగింపులు గుట్టుచప్పుడు కాకుండా టెక్ కంపెనీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కొనసాగించాయి. గ్లోబల్ టెక్ కంపెనీల్లో తొలగింపుల మ్యాటర్ పెద్ద చర్చకు దారితీయగా దేశీయ ఐటీ కంపెనీల్లో ఇది సైలెంట్‌గా జరిగిపోయింది.

గడచిన ఆర్థిక సంవత్సర కాలాన్ని పరిశీలిస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు కూడా సిలికాన్ వ్యాలీలో భారీ ఎత్తున తమ ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి. దీంతో వేలాదిమంది తమ ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆర్థిక మందగమనం, ఆటోమేషన్, కంపెనీల ఖర్చుల మదింపు తొలగింపులకు దారితీశాయని తెలుస్తోంది. ఇక్కడ గ్లోబల్ కంపెనీలు లేఆఫ్స్ బాహాటంగా చేపడుతుంటే.. ప్రముఖ భారతీయ టెక్ కంపెనీలు వీటిని రహస్యంగా కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తమకు అక్కర్లేదు అనుకున్న ఉద్యోగులను సదరు కంపెనీలు తొలగించటం లేదా వారిని రాజీనామా చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో దాదాపు 20,000 మంది టెక్ నిపుణులు ఉద్యోగాలను కోల్పోయినట్లు ఆల్ ఇండియా ఐటీ అండ్ టెక్ ఎంప్లాయీస్ యూనియన్ అంచనా వేసింది. తగ్గింపుకు ముందు తమ కంపెనీలో ఇతర చిన్న ఉద్యోగాలను ఎంచుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే చాలా కంపెనీలు తమ తమ కార్యాలయ సమయాన్ని 10- 12 గంటల నుంచి 14-16 గంటలకు పెంచాయి. దీంతో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోతోంది. అంతే కాకుండా ఉద్యోగులు భరించలేని పనిభారాన్ని కంపెనీలు మోపుతున్నాయనే ఆరోపణలున్నాయి.
ఇలాంటి చర్యల వల్ల ఉద్యోగులే విధులకు దూరమవుతున్నారని అంటున్నారు. కంపెనీలు అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు 2023 ఆర్థిక సంవత్సరంలో ఇటువంటి తగ్గింపు జరిగింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడినా కంపెనీల తగ్గింపు కొనసాగుతోందన్నాయి వినిపిస్తోంది. చాలా కంపెనీలు తమ లాభాలను పెంచుకునేందుకు ఉద్యోగుల తొలగింపులను కొనసాగిస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి కంపెనీలతో ఉద్యోగుల సంఘాలు చర్చలు జరుపుతున్నప్పటికీ ఫలితం దక్కలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలన్నది ఉద్యోగుల డిమాండ్‌లు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications