బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్‌లో ఈరోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో(MCX) నిన్న ప్రారంభంలో పెరిగిన ధరలు ఆ తర్వాత తగ్గాయి. ఈ రోజు (సెప్టెంబర్ 2, బుధవారం) ఉదయం అదే ఒరవడి కొనసాగింది. ప్రారంభ ట్రేడింగ్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.35 శాతం క్షీణించి 10 గ్రాములు రూ.51,320 పలికింది. వెండి ఫ్యూచర్స్ 1.3 శాతం(రూ.900) పడిపోయి కిలో రూ.70,000 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి ఫ్యూచర్స్ 0.44 శాతం తగ్గగా, వెండి ఫ్యూచర్స్ మాత్రం 0.4 శాతం ఎగిసింది. ఆగస్ట్ 7వ తేదీకి ముందు పెరుగుతూ వచ్చిన ధరలు, ఆ తర్వాత రష్యా వ్యాక్సీన్ రావడంతో ఇరవై రోజులుగా అస్థిరంగా ఉంటున్నాయి. అయితే గరిష్ట ధరతో పోలిస్తే దాదాపు రూ.5 వేల వరకు తక్కువగా ఉంది.

నగరాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడల్లో బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. కానీ గత ఇరవై రోజుల్లో గరిష్ట ధర రూ.58 వేలకు పైగా పలికిన ధరలు ఇప్పుడు రూ.54వేలకు అటు ఇటుగా తచ్చాడుతున్నాయి. గత పది రోజుల్లో పెరుగుదల, తగ్గుదలను పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా 22 క్యారెట్ల పసిడి రూ.800 వరకు తగ్గింది. 24 క్యారెట్ల పసిడి రూ.900 వరకు తగ్గింది. 22 క్యారెట్ల పసిడి రూ.49,700కు పైగా, 24 క్యారెట్ల బంగారం రూ.54,200 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ 1,971.07 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1,978.90 డాలర్ల వద్ద దాదాపు స్థిరంగా ఉంది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ఔన్స్ 0.3 శాతం పెరిగి 28.25 డాలర్లు, ప్లాటినమ్ 0.3 శాతం పెరిగి ఔన్స్ 943.63 డాలర్లు పలికింది. పసిడి ధరల ధోరణి 2000 డాలర్లకు పైగా పెరిగితే మరింత పైకి చేరే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలిక ట్రెండ్ 2,089 డాలర్ల నుండి 1,874 డాలర్లు. సమీప కాలంలో మద్దతు ధర 1889 డాలర్ల నుండి 1842 మధ్య ఉంది.

పసిడి ధరలపై ప్రభావం
పసిడి ధరపై వివిధ అంశాలు ప్రభావం చూపుతాయి. ద్రవ్యోల్బణం, దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్, కేంద్రబ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, ప్రస్తుతం కరోనా మహమ్మారి, డాలర్, ట్రేడ్ వార్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.


Click it and Unblock the Notifications