మెట్రో నగరాలకంటే టైర్ 2, 3 నగరాల్లో ఉద్యోగ అవకాశాలు 21% పెరిగాయి... అసలు ఎందుకు అక్కడ పెరుగుతున్నాయో తెలుసా
సెప్టెంబర్ నెలలో ఉద్యోగ నియామకాల్లో టైర్ 2, 3 నగరాలు ఊపందుకున్నాయి. తాజా రిపోర్ట్ ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈ ప్రాంతాల్లో "హైరింగ్ 21% వరకు పెరిగింది", ఇది మెట్రో నగరాల వృద్ధిని కూడా మించి ఉంది. ఈ రిపోర్ట్‌ను జాబ్స్ & టాలెంట్ ప్లాట్‌ఫాం "ఫౌండిట్" విడుదల చేసింది.
సెప్టెంబర్‌లో వచ్చిన ఈ బలమైన వృద్ధికి ప్రధాన కారణం పండుగ సీజన్. షాపింగ్, ట్రావెల్, హాస్పిటాలిటీ ఇలా అన్నీ కలిసి ఉద్యోగ మార్కెట్‌కి బూస్ట్ ఇచ్చాయి. ప్రత్యేకంగా ఈ-కామర్స్, హోటల్ & ట్రావెల్, గిగ్/ఫ్రీలాన్స్ పనులు బాగా పెరిగాయి. 2024తో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్‌లో హైరింగ్ యాక్టివిటీ ఇంకా బలంగా కనిపించింది.

టైర్ 2, టైర్ 3 నగరాలు ఇప్పుడు కేవలం చిన్న పట్టణాలు మాత్రమే కావు, టాలెంట్ హబ్‌లుగా వేగంగా ఎదుగుతున్నాయి. పండుగ సీజన్ డిమాండ్‌తో ఈ వృద్ధి మరింత బలపడింది అని ఫౌండిట్ VP (మార్కెటింగ్) అనుపమా భీమ్రాజ్కా తెలిపారు. మెట్రో నగరాలు స్థిరంగా ఎదుగుతున్నా, నాన్-మెట్రో ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. ఇది దేశంలో ఉద్యోగ అవకాశాలు విభిన్నంగా, మారుతున్నదానికి స్పష్టమైన ఉదాహరణ," అని ఆమె చెప్పారు.
మెట్రో నగరాలు - ఢిల్లీ NCR, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే, కోల్‌కతా వంటి నగరాల్లో బ్యాంకింగ్ & ఫైనాన్స్, మీడియా రంగాల వల్ల "14% హైరింగ్ వృద్ధి" నమోదైంది. టెక్, ఫైనాన్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌కి డిమాండ్ బాగుంది. టైర్ 2, టైర్ 3 నగరాలు - జైపూర్, లక్నో, కోయంబత్తూర్, ఇండోర్, భువనేశ్వర్, కొచ్చి, సూరత్, నాగ్‌పూర్, చండీగఢ్ వంటి నగరాల్లో మాత్రం వృద్ధి "21%కి చేరింది". ఈ-కామర్స్ వేర్‌హౌజింగ్, రిటైల్ విస్తరణ, కస్టమర్ సపోర్ట్ సెంటర్లు, పండుగ టూరిజం వంటివి ఇందులో కీలక పాత్ర పోషించాయి.
సెప్టెంబర్‌లో ఉద్యోగ నియామకాలలో పలు రంగాలు మంచి వృద్ధిని చూపించాయి. అందులో సేల్స్ మరియు మార్కెటింగ్ రంగం అత్యధికంగా 5% వృద్ధిని నమోదు చేసింది. పండుగ సీజన్ కారణంగా ఈ రంగంలో కొత్త ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి దగ్గరగా కస్టమర్ సపోర్ట్ మరియు ఆపరేషన్స్ రంగాలు 4% వృద్ధితో ముందంజలో ఉన్నాయి. అలాగే క్రియేటివ్ మరియు మీడియా రంగం కూడా 4% పెరిగింది. ఇందులో ప్రధాన కారణాలు ప్రకటన కాంపెయిన్లు మరియు OTT ప్రాజెక్టులు. ఇక టెక్నాలజీ మరియు ప్రొడక్ట్ రోల్స్ 3% స్థిరమైన వృద్ధి సాధించగా, ఫైనాన్స్ మరియు అకౌంట్స్ రంగం 2% పెరిగింది. పండుగ సీజన్‌లో లోన్స్, క్రెడిట్ యాక్టివిటీల వల్ల ఈ రంగంలో డిమాండ్ పెరిగిందని రిపోర్ట్ చెబుతోంది.
0-3 సంవత్సరాల అనుభవం ఉన్న ఎంట్రీ లెవల్ కాండిడేట్స్‌కి ఈ సీజన్‌లో ఉద్యోగ మార్కెట్ బాగా తెరుచుకుంది. 2024లో 42% ఉన్న వాటి షేర్, 2025లో 45%కి పెరిగింది. ఈ-కామర్స్, కస్టమర్ సపోర్ట్ వంటి రంగాలు దీనికి ప్రధాన కారణం. సీనియర్ లెవల్ ఉద్యోగాలు కూడా స్థిరమైన వృద్ధి నమోదు చేశాయి. మొత్తానికి, పండుగ సీజన్ హైరింగ్‌ను ఊపందించడమే కాకుండా, టైర్ 2, టైర్ 3 నగరాలు కూడా ఉద్యోగ మార్కెట్‌లో గట్టి పోటీదారులుగా ఎదుగుతున్నాయన్నది ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications