Coffee Industry: కరోనా వ్యాప్తి అనంతరం పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. వాటిలో దేశీయ కాఫీ సెక్టార్ కూడా ఒకటి. వైరస్ దెబ్బకుతోడు వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల ఈ రంగానికి పెద్ద దెబ్బపడినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కాఫీ పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవాలుగా ఉండవచ్చని తెలుస్తోంది. తక్కువ వర్షపాతం సహా తోట పంటల ధరల క్షీణత దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. '2022-23లో అకాల వర్షాలు, అంతకుముందు ఏడాది అధిక వర్షపాతం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. వీటికితోడు ధరల క్షీణత వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం' అని ఓ కాఫీ ఎస్టేట్ యజమాని సల్మాన్ బసీర్ వాపోయారు.

'గత మూడేళ్ళతో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం సగటున 20 నుంచి 30 శాతం మేర క్షీణించింది' అని టాటా కాఫీ R&D అధినేత కురియన్ రాఫెల్ తెలిపారు. ఈ సంస్థకు కర్ణాటక అంతటా కాఫీ ఎస్టేట్‌లు ఉన్నాయి. దేశం మొత్తం కాఫీ ఉత్పత్తిలో 70 శాతానికి పైగా దీని సొంతం. గత రెండేళ్లుగా నెలకొన్న పరిస్థితులు తమను ఆందోళనకు గురిచేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో కాఫీ ఉత్పత్తి 6.3 శాతం వృద్ధిని కనబర్చవచ్చని కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఇది మొత్తం 3.74 లక్షల టన్నులకు చేరుకోవచ్చని పేర్కొంది. కాఫీ తోటల యజమానులకు ఈ ఏడాది చాలా ఆశాజనకంగా ఉంటుందని భావిస్తోంది.
జనవరిలో కురిసిన అకాల వర్షాలు, వలస కూలీల కొరత కారణంగా.. ఈ ఏడాది కనీసం నెల ముందుగానే కోతలు ప్రారంభమైనట్లు తోటల యజమానులు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న జల్లులు కూడా గణనీయమైన పంట నష్టానికి కారణమవుతున్నాయన్నారు. ఇవాళ 11 వేల 200 పలుకుతున్న 20 కిలోల అరబికా పార్చ్ మెంట్ ధర మేలో 15 వేల 700 ఉంది. అంటే 6 నెలల్లో 29 శాతం క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications