Gold: ఆ బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు.. తేడా వస్తే మొదటికే మోసం..!
బంగారం ధర పెరుగుతూ వస్తోంది. గత ఏడాది నుంచి పసిడి ధర భారీగా పెరిగింది. ధరలు పెరిగినా కొనుగోలు ఆగలేదు. అయితే భారత్ ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటుంది. భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో కేంద్రం పుత్తడి దిగుమతిపై సుంకాన్ని భారీగా పెంచింది. 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక వివరాలు బయట పెట్టింది. ఇండియాలోకి అక్రమ మార్గాల్లో బంగారం రావడం గణనీయంగా పెరిగిందని వివరించింది.
దీంతో దేశీయంగా బిల్లు లేకుండా బంగారం ఆభరణాల విక్రయాలు పెరుగుతున్నాయని వివరించింది.
దీని వల్ల అక్రమార్కులు భారీగా లాభాలు ఆర్జిస్తుండగా, పన్నులు చెల్లించి వ్యాపారం చేసే వ్యవస్థీకృత ఆభరణాల వర్తకులు నష్టపోతున్నారని గుర్తు చేసింది. అందుకే అధికారికంగా బంగారు ఆభరణాల కొనుగోలు తగ్గినట్లు తెలుస్తోంది. మే 13న సుంకాలు పెంచగా.. ఆ తరవాత ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న అక్రమ బంగారం పరిమాణం దాదాపు రెట్టింపైనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గుర్తు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్‌లో దేశంలో 131.4 టన్నుల బంగారం అధికారికంగా అమ్ముడు పోయింది. గతేడాదితో పోలిస్తే ఇది తక్కువే. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలని కోరారు. ఇది కూడా బంగారం కొనుగోళ్లు తగ్గడానికి కారణంగా వివరిస్తుంది.

2025 ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 139.7 టన్నుల బంగారంతో పోలిస్తే ఇది 6 శాతం తక్కువని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. అయితే ఏడాది వ్యవధిలో ధర బాగా పెరిగినందున, విలువ రీత్యా కొనుగోళ్లు రూ.1,32,500 కోట్ల నుంచి 50 శాతం పెరిగి రూ.1,98,100 కోట్లకు చేరిందని తెలిపింది. ఆభరణాలకు గిరాకీ 88.8 టన్నుల నుంచి 15% తగ్గి 75.1 టన్నులకు పరిమితమైనట్లు పేర్కొంది. అనధికారంగా బంగారం కొంటే వినియోగదారులే నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. బిల్లులు లేకుండా బంగారం కొనుగోలు చేస్తే నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. పసిడి స్వచ్ఛతలో తేడా వస్తే మొదటికే మోసం వస్తుందని గుర్తు చేస్తున్నారు.
బంగారం ధర తగ్గినప్పుడు కొనుగోలు చేద్దామని చాలా మంది భావిస్తున్నారు. అయితే బంగారం ధర పెరగడం, తగ్గడంపై భిన్న వాదనలు ఉన్నాయి. బంగారం, వెండి ఒక్క రాత్రిలో ధనవంతులను చేసే పెట్టుబడులు కాదని ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి అన్నారు. ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షించే ఫైనాన్షియల్ లైఫ్‌బోట్లు బంగారమని తెలిపారు. పరిస్థితులు మరింత క్లిష్టం అయ్యే వరకు వేచి చూడకుండా, చిన్న మొత్తంతో అయినా వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలోని బంగారం కొనుగోలు చేసి నిజమైన సంపదను కూడబెట్టడం ప్రారంభించాలని సూచించారు. అయితే బంగారం ఫిజికల్ గానే కాదు.. డిజిటల్ గా కూడా కొనుగోలు చేయవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications