Telangana: మహిళలకు గుడ్ న్యూస్.. కేవలం 4 శాతం వడ్డీతో రుణాలు..!
మహిళల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ లు నిర్వహిస్తున్నారు. అలాగే మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేయించి.. వాటిని ఆర్టీసీలో అద్దెకు ఇస్తున్నారు. మహిళ కోసం ఉచిత బస్ పథకం తీసుకొచ్చారు. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థానికంగా జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో పాడి, పశుపోషణ రంగాలకు పెద్దపీట
వేసింది. 2023 నుంచి ఈ ఏడాది వరకు నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిషన్ కింద వచ్చే కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ద్వారా రూ.107 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.25 లక్షల మంది మహిళలకు వివిధ రకాల పశుపోషణ యూనిట్లను మంజూరు చేసింది.
ఇందులో బర్లు, గొర్రెలు, ఆవులు, కోళ్ల యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు 2026-27 కు సంబంధించి రూ.77.23 కోట్ల అంచనాతో 1.90 లక్షల మంది మహిళలకు పాడి, పశుపోషణ యూనిట్లు కేటాయించనున్నారు. రాష్ట్రంలోని 553 మండల సమాఖ్యల పరిధిలో మొత్తం 11 రకాల జీవనోపాధి రంగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు. తక్కువ పెట్టుబడితో రోజూవారీ ఆదాయాన్ని సమకూర్చే పెరటి కోళ్ల (నాటుకోళ్లు) పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతే డాది 75,011 పెరటి కోళ్ల యూనిట్లను కేటాయించారు. నాణ్యమైన కోడిపిల్లలను లబ్ధిదారులకు అందించడానికి 587 మదర్ యూనిట్లను ఇప్పటికే సిద్ధం చేశారు. వీటిలో కోడిపిల్లలను పెంచి, క్రమం తప్పకుండా టీకాలు వేసిన తర్వాతే మహిళలకు అందజేస్తామని అధికారులు తెలిపారు.

కోళ్లు బలంగా ఉండి.. మరణాలు తగ్గుతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా గుడ్లు, మాంసం విక్రయాల ద్వారా మహిళల చేతికి రోజుకు కొంత డబ్బు వస్తుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకల పెంపకానికి ఉన్న మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మహిళలకు ప్రత్యేక ఆర్థికసాయం చేయనున్నారు. ఒక్కో గొర్రె పొట్టేళ్ల యూనిట్ ఏర్పాటుకు సామాజిక పెట్టుబడి నిధి ద్వారా రూ. 90 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు రుణాలు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.
బ్యాంకుల ద్వారా కేవలం నాలుగు శాతం వడ్డీకే ఈ రుణాలు వస్తాయని గుర్తు చేశారు. దీంతో మహిళలకు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 787 గొర్రెలు, మేక పిల్లల నర్సరీలను అందుబాటులో ఉంచారు. పశుపోషణతో పాటు వాటి అనుబంధ రంగాలకూ ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద 60 శాతం సబ్సిడీతో 81 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లను, 63 మత్స్య పెంపకం యూనిట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. పాలు, పాల ఉత్పత్తుల విక్రయాల కోసం 90 మిల్క్ పార్లర్లు, 77 గడ్డి కత్తిరించే యంత్రాలు (చాఫ్ కట్టర్లు), 55 పశుగ్రాస యూనిట్లు, 23 కౌజు పిట్టల (క్వెయిల్) పెంపకం యూనిట్లను లబ్ధిదారులకు అందించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications