నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త పథకంతో వేలాది ఉద్యోగాలు..!
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగుల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాల్ని కూడా విడుదల చేసింది. ఇందుకు సంబంధించి జీవో నంబర్ 19 జారీ చేసింది. ఈ పథకం ద్వారా విదేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు, వృత్తి విద్య పూర్తి చేసిన వారికి వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. అవగాహన లేకపోవడం, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం, విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ ఖర్చు కావడంతో పేద కుటుంబాలకు చెందిన యువతకు ఇబ్బందిగా మారింది.
విదేశీ భాషల్లో శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాల పెంపు, ఉద్యోగాలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు టామ్‌కామ్ సహకరిస్తుంది. సురక్షితంగా, చట్టబద్ధంగా విదేశాల్లో ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం లభించనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మందికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేరుగా విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే 5,880 మందికి, విదేశీ భాషల్లో ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లే 1,120 మందికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విదేశీ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులను రెండు కేటగిరీలుగా విభజించారు.

విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ, పరీక్షలు అవసరం లేకుండా నేరుగా ఉద్యోగాలకు వెళ్లే వారిని మొదటి కేటగిరీలో చేర్చారు. వీరికి వీసా, విమాన ప్రయాణ ఖర్చుల నిమిత్తం గరిష్ఠంగా రూ.లక్ష వరకు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.50 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. ఆయా దేశాల భాషల్లో ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లే వారిని రెండో కేటగిరీగా విభజించారు. ఈ కేటగిరీలో గరిష్ఠంగా రూ.3.50 లక్షల వరకు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనున్నారు.
రెండు కేటగిరీల్లోనూ మిగతా 50 శాతం ఖర్చును అభ్యర్థులు భరించాల్సి ఉంటుంది. సొంతంగా డబ్బు సమకూర్చుకోలేని వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తారు. ఇందుకు ప్రత్యేక రుణ విధానాన్ని రూపొందించేందుకు టామ్‌కామ్ జాతీయ బ్యాంకులతో చర్చనుంది. నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమలు, ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, రవాణా, లాజిస్టిక్స్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, వైద్య సహాయక సేవలు, హోటళ్లు, పర్యాటకం, మరమ్మతులు, నిర్వహణ, గృహ, వ్యక్తిగత సేవల రంగాల్లో ఉద్యోగాలకు ఈ పథకం వర్తించనుంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితికి లోబడి ఉన్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వృత్తిలో కనీసం రెండేండ్ల పని అనుభవం ఉండాలి. ఆయా దేశాల వర్క్ వీసా నిబంధనలను బట్టి పని అనుభవం విషయంలో మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే నాటికి పాస్‌పోర్టు గడువు కనీసం ఆరు నెలలు ఉండాలి. ఉద్యోగ సంస్థలు నిర్దేశించిన వైద్య పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications