Pensions: అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి..!
పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దసరా పండుగకు ముందే లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త పెన్షన్ల అమలుకు సంబంధించిన ప్రక్రియ అధికారులు వేగవంతం చేశారు. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రాబోయే అక్టోబర్ నెల నుంచి అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించాలని సీతక్క అధికారులకు స్పష్టం చేశారు.
పండుగ సమయానికి ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో దసరా పండుగకు ముందే కొత్త పెన్షన్లు అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. వెరిఫికేషన్ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు, అవసరమైతే క్షేత్రస్థాయిలో అదనపు సిబ్బందిని నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చూసే బాధ్యతను సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు అప్పగిస్తూ మంత్రి తగు ఆదేశాలు జారీ చేశారు.

దరఖాస్తు చేసుకున్న వారిలో పూర్తి స్థాయిలో అర్హత కలిగిన ఒంటరి మహిళలు, వితంతువులకు ఈ పథకం కింద ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్లు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క నిజమైన అర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం, మంత్రుల ఆదేశాల మేరకు యంత్రాంగం దసరా నాటికి కొత్త పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఆలస్యం లేకుండా పింఛను అందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే అధికారులు పలు జిల్లాల్లో వేరిఫికేషన్ పూర్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి మొత్తం 5,98,193 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ జిల్లా నుంచి 46,540 అప్లికేషన్లు రాగా, అత్యల్పంగా గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లా నుంచి కేవలం 4,818 దరఖాస్తులు వచ్చాయి. విభాగాల వారీగా పరిశీలిస్తే, వితంతు పెన్షన్ల కోసమే గరిష్టంగా 3.31 లక్షల మంది పేద మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
