Gold Monetization Scheme: గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్.. బంగారంపై వడ్డీ చెల్లింపు..!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు వెళ్తోంది. దేశంలోని చాలా మంది వద్ద, వారి లాకర్లు, అల్మారాల్లో వేలకొద్ది బంగారం ఉంది. చాలా మంది పుత్తడిని లాకర్లలో పెడతారు. ఇలాంటి బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకురానున్నారు. వచ్చే 15 రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ఉన్న 25 వేల టన్నుల బంగారంలో కనీసం 5 శాతం పుత్తడిని ఈ స్కీమ్ లోకి తీసుకొస్తే.. 1250 టన్నుల బంగారం ఆర్థిక వ్యవస్థలో వస్తుందని భావిస్తున్నారు. ఈ 5 శాతం బంగారం విలువ సుమారు రూ.8 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని గతంలో కూడా తీసుకొచ్చారు. 2015లో మానిటైజేషన్ స్కీమ్ తీసుకు రాగా అప్పుడు ప్రజల నుంచి స్పందన రాలేదు. పైగా అప్పుడు కేవలం బ్యాంకుల వద్దే పసిడి డిపాజిట్ చేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు తీసుకొచ్చే పథకంలో దేశవ్యాప్తంగా ఉన్న నగల వ్యాపారులను భాగస్వాములుగా చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఇదే జరిగితే ప్రజలు తమ దగ్గరలో ఉన్న గుర్తింపు పొందిన నగల షాపులో పసిడిని డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ భద్రత సంగతి ఏమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కాగా ఇళ్లలో ఉపయోగంలో లేని బంగారాన్ని అలానే ఉంచితే ఎలాంటి ఆదాయం రాదు. కానీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే పసిడి వడ్డీ వస్తుంది. అంతేకాకుండా అవసరమైనప్పుడు బంగారానికి సమానమైన డబ్బును తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం.. ఉపయోగంలో లేని పసిడితో ఆదాయం పొందడం. కొత్త స్కీమ్ అమలైతే జ్యువెలరీ దుకాణాలకు కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజల నుంచి బంగారాన్ని సేకరించే బాధ్యత రావడంతో వారి వద్దకు కస్టమర్ల రాక పెరిగే అవకాశం ఉంది.
ఇండియా ప్రతి సంవత్సరం భారీగా బంగారం దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయితే ఈ స్కీమ్ విజయవంతమైతే బంగారం దిగుమతులు భారీగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.2015లో ప్రారంభించిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పెద్దగా సక్సెస్ కాలేదు. పదేళ్లలో కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే స్కీమ్ కింద డిపాజిట్ చేశారు. కుటుంబ వారసత్వ నగలను కరిగించేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడం, పన్నులపై భయాలు, బ్యాంకులు ఈ పథకాన్ని పెద్దగా ప్రోత్సహించకపోవడం ఇలా జరిగినట్లు విశ్లేషించారు.


Click it and Unblock the Notifications