Hyderabad: స్పీడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. కాగ్నిజెంట్ న్యూ క్యాంపస్ ప్రారంభం..
Cognizant News: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలు, టెక్ రంగంలోని కంపెనీలకు భారతదేశంలోని హైదరాబాదు మహానగరం వ్యాపార స్థాపనకు గమ్యస్థానంగా దశాబ్ధాలుగా తీర్చిదిద్దబడిన సంగతి తెలిసిందే. దీనిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం మరింతగా కృషి చేస్తోంది.
ఈ క్రమంలోనే ఆగస్టు 14న ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహా మరింతమంది కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గతవారం అమెరికా పర్యటనలో కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్‌తో క్యాంపస్ విస్తరణకు సంబంధించి చర్చలు జరిపారు. అయితే ఒప్పందం జరిగిన పదిరోజుల్లోనే కంపెనీ తన హైదరాబాద్ క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది.

దీంతో తెలంగాణలో రెండో అతిపెద్ద ఐటీ ఎంప్లాయర్ కాగ్నిజెంట్ తన కొత్త 10 లక్షల చదరపు అడుగుల క్యాంపస్ నిర్మాణానికి ముందడుగు వేసింది. ఇది ఏఐ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా అధునాతన సాంకేతికతలపై దృష్టి పెట్టడం ద్వారా 15,000 కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ కంపెనీ క్యాంపస్ విస్తరణ భూమి పూజలో పాల్గొన్నారు.
వాస్తవానికి ఐటీ మేజర్ కాగ్నిజెంట్ 1994లో చెన్నైలో స్థాపించబడింది. అప్పటి నుంచి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. అలా 2002లో హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పుడు ఐటీ కారిడార్‌లో ఐదు క్యాంపస్‌లను కలిగి ఉంది. గత రెండేళ్లలో రాష్ట్రంలోని 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7,500 మందికి టెక్ మేజర్ రిక్రూట్ చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కాగ్నిజెంట్ గత ఆర్థిక సంవత్సరంలో చేసిన ఐటీ ఎగుమతులు మొత్తం విలువ రూ.7,725 కోట్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications