టెస్లా కార్లపై ఎలాన్ మస్క్ డిమాండ్‌కు భారత ప్రభుత్వం నో
ఎలక్ట్రిక్ వెహికిల్ దిగ్గజం టెస్లాకు భారత్‌లో మరో షాక్ తగిలింది. దిగుమతి సుంకాలపై ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా డిమాండుకు కేంద్ర ప్రభుత్వం ససేమీరా అన్నట్లుగా తెలుస్తోంది. దిగుమతి చేసే కార్లపై సుంకాలు తగ్గించాలనే ఎలాన్ మస్క్ ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది. ఇప్పటికే పాక్షికంగా తయారు చేసిన వాహనాలను దేశంలో దిగుమతి చేసుకొని అసెంబ్లింగ్ చేస్తే వాటిపై తక్కువ సుంకాలనే విధిస్తున్నట్లు కేంద్రం పునరుద్ఘాటించింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ పైన దిగుమతి సుంకాలను సవరించాల్సిన అవసరం ఉందా అనే దానిపై సమీక్షించామని, అయితే ఇప్పటికే దేశీయంగా ఈవీల ఉత్పత్తి కొనసాగుతుందని, ప్రస్తుత టారిఫ్ వ్యవస్థతో కొన్ని పెట్టుబడులు వస్తున్నాయని, ఇదే సుంకాల వ్యవస్థతోనే కొన్ని విదేశీ బ్రాండ్స్ భారత్‌లో విక్రయాలు చేపడుతున్నాయని పేర్కొంది.
ఇంపోర్ట్ సెస్ అనేది సమస్య కాదని తెలుస్తోందని, అలాంటి సమయంలో ఇతరులకు సమస్య ఏమిటని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్ వివేక్ అన్నారు. దిగుమతి చేసుకునే వాహనాలపై సెస్ తగ్గించాలనే ప్రతిపాదన బడ్జెట్‌లో లేదని తేల్చి చెప్పారు. దేశీయంగా తయారీ యూనిట్, కంపెనీ భవిష్యత్తు పెట్టుబడులపై ప్రణాళిక ఇవ్వాలని టెస్లాను కోరితే, కంపెనీ నుండి స్పందన రాలేదన్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ దిగుమతిలపై 100 శాతం సెస్ ఉందని, దీనిని తగ్గించాలని టెస్లా కోరుతుంది. అయితే భారత్‌లో యూనిట్ ఏర్పాటు చేస్తే ఆలోచిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

గత కొంతకాలంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కార్లు భారత్‌లో చర్చనీయంశంగా మారిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వంతో సవాళ్లున్నాయని, అందుకే టెస్లా భారత్ ఎంట్రీ ఆలస్యమవుతోందని ఎలాన్ మస్క్ కొద్ది రోజుల క్రితం ఓ నెటిజన్‌కు సమాధానం చెప్పారు. దీంతో తెలంగాణ, పంజాబ్ సహా వివిధ రాష్ట్రాలు ఎలాన్ మస్క్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. భారత ప్రభుత్వం టెస్లాకు పన్ను మినహాయింపుకు సిద్ధంగా ఉంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా విడిభాగాల యూనిట్ ఇక్కడ ఉండాలని చెబుతోంది. కానీ టెస్లా మాత్రం మొత్తం కారును చైనా నుండి దిగుమతి చేయాలని చూస్తోంది. దీనికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇక్కడ యూనిట్ ఏర్పాటుకు టెస్లా సిద్ధంగా లేదు. ఎలాన్ ట్వీట్‌ను పొరపాటుగా అర్థం చేసుకున్న రాష్ట్రాలు యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి.


Click it and Unblock the Notifications