Telangana: మహిళలకు వడ్డీ లేని రుణాలు విడుదల.. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి KTR
Telangana: మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు రూ.750 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో రూ.250 కోట్లను పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు విడుదల చేస్తున్నట్లు పురపాలక మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
కొద్ది కాలంగా పెండింగులో ఉన్న వడ్డీ లేని రుణాల బకాయి సొమ్మును సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విడుదల కావటంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలోని పురపాలికల్లో 1.77 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉండగా.. వాటిలో దాదాపు 18 లక్షల మంది సభ్యులు ఉన్నారని సమాచారం. వీరికి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వడ్డీ లేని రుణాలు దోహదపడతాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్లలో రూ.20 లక్షలతో అభివృద్ధి చేసిన 'పల్లె దవాఖాన'ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆధునిక హంగులతో రూరల్ క్లినిక్‌లను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి క్లినిక్ మెుదటిదని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ ఆశా వర్కర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.

పర్యటనలో భాగంగా తంగళ్లపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను కేటీఆర్ ప్రారంభించారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక జిజ్ఞాసను పెంపొందించేందుకు, నాణ్యమైన పరిశోధనలను బలోపేతం చేసేందుకు, మెరుగైన విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాల్లో వసతులను మెరుగుపరుస్తోంది.


Click it and Unblock the Notifications