CBI Probe Into Kaleshwaram Project: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIP) గత కొంతకాలంగా వివాదాల బాట పట్టింది. ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, రుణాల వినియోగం, పనుల్లో అవకతవకలు, సాంకేతిక లోపాలు అన్నీ కలిసి ఈ ప్రాజెక్టు మీద తీవ్ర ప్రశ్నార్థకాలను లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలని కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం జీవో Ms 104 జారీ: సీబీఐ దర్యాప్తు చేపట్టడానికి అవసరమైన నిబంధనల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అనుమతి ఇవ్వాలి. అదే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జీవో Ms 104ని జారీ చేసింది. ఈ ఉత్తర్వులో ప్రాజెక్టు అనేక అంతర్-రాష్ట్ర అంశాలను కలిగి ఉందని, కేంద్రం, రాష్ట్రం రెండింటికి చెందిన విభాగాలు, ఏజెన్సీలు, అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSUలు) భాగస్వామ్యం చేశాయని జీవోలో ప్రస్తావించింది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పారదర్శక దర్యాప్తు జరగాలంటే సీబీఐకే ఈ కేసు అప్పగించడం సముచితమని ప్రభుత్వం అభిప్రాయపడింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) 2023 నవంబర్ 1న మొదటి నివేదిక సమర్పించింది. అనంతరం 2024 మే 1న మధ్యంతర నివేదికను, 2025 ఏప్రిల్ 24న తుది నివేదికను సమర్పించింది. ఈ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పి.సి. ఘోష్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ తన పరిశోధనలను 2025 జూలై 31న సమర్పించగా, రాష్ట్ర మంత్రివర్గం ఆ నివేదికను ఆమోదించింది. ఆ తరువాత ఆగస్టు 31న అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టారు. సభలో ఈ అంశంపై స్వల్ప చర్చ కూడా జరిగింది. చివరికి కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అభిప్రాయం: ఈ నిర్ణయం వెలువడినాక సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఒక వీడియోలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రం నోటిఫికేషన్ జారీ చేయడం మాత్రమే సరిపోదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం సెక్షన్ 5 కింద నోటిఫికేషన్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సీబీఐకు పూర్తిస్థాయి అధికారాలు లభిస్తాయి. లేదంటే, సీబీఐ దర్యాప్తు ప్రారంభం కావడం అనుమానమేనని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని సుగాలి ప్రీతి కేసును ఉదహరించారు. అక్కడ రాష్ట్రం అనుమతి ఇచ్చినా, కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో సీబీఐ దర్యాప్తు ప్రారంభం కాలేదని గుర్తుచేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతికి పాల్పడితే, అటువంటి సందర్భంలో ప్రత్యేక అనుమతి లేకుండానే సీబీఐ ముందుకు సాగవచ్చని ఆయన వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు హాట్ టాఫిక్ అయింది.ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమవుతుందో, దాని పరిధి ఎంతవరకూ విస్తరించుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది. అయితే ఇప్పుడు అవినీతి, రుణ దుర్వినియోగం, ఇంజనీరింగ్ లోపాల ప్రతీకగా నిలుస్తోంది. సీబీఐ దర్యాప్తు వాస్తవాలను ఎంతవరకు వెలికితీస్తుందో, నిజమైన బాధ్యులుగా ఎవరిని నిర్ధారిస్తుందో అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.
కాళేశ్వరం సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్ : తాజాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (KLIP) వివాదం హైకోర్టుకు చేరింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇద్దరు నేతలు కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ, దానిని నమ్మదగిన ఆధారంగా తీసుకోవడం సరికాదని కోర్టులో వాదనలు వినిపించారు.విచారించిన ధర్మాసనం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో కేసు కొత్త మలుపు తిరిగింది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్, కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు విచారణార్హం కాదని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయాలని నిర్ణయించిందని కోర్టుకు తెలియజేశారు. అలాగే, ఈ దర్యాప్తు పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ఆధారంగానే జరుగుతుందని వివరించారు. హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, సీబీఐ దర్యాప్తుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వెళ్ళకూడదని తేల్చి చెప్పింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 7కి వాయిదా వేసింది.
ఈ తీర్పుతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ న్యాయపరమైన చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం పారదర్శకత కోసం సీబీఐ విచారణ అవసరమని వాదిస్తుండగా, మరోవైపు మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు తమపై రాజకీయ దురుద్దేశంతో ఈ నివేదికను వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి అక్టోబర్ 7న జరిగే తదుపరి విచారణపైనే ఉంది. హైకోర్టు తీసుకునే నిర్ణయం కేవలం ఈ కేసు పరిమితిలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయ సమీకరణాలపైనా, కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపైనా కీలక ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
సీబీఐకి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం: సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం పంపిన ఆ లేఖలో, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలు మాత్రమే కాకుండా అంతర రాష్ట్ర సమస్యలపై కూడా విచారణ జరపాలని రాష్ట్రం కోరింది. కేంద్రం-రాష్ట్రం మధ్య జరిగిన వ్యవహారాలను కూడా దర్యాప్తులో భాగం చేయాలని లేఖలో స్పష్టంచేసింది. ఈ నిర్ణయానికి అసెంబ్లీ ఇప్పటికే ఆమోదం తెలిపిందని ప్రభుత్వం గుర్తుచేసింది. అలాగే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) సమర్పించిన నివేదికలో కాళేశ్వరం నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నట్లు తేలిందని రాష్ట్రం లేఖలో పేర్కొంది.
ప్రణాళిక, డిజైన్, నాణ్యత నియంత్రణ, నిర్మాణ ప్రమాణాలు అన్నింటిలోనూ సమస్యలు ఉన్నాయని నివేదికలో చెప్పబడిందని వివరించింది. అంతేకాక, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా పరిశీలించి, అదే విధంగా లోపాలను గుర్తించిందని స్పష్టం చేసింది. ఈ నివేదికల ఆధారంగానే అసెంబ్లీలో చర్చ జరిపి సీబీఐ విచారణకు ఆమోదం తెలిపామని లేఖలో వివరించింది. మరోవైపు, గతంలో సీబీఐ రాష్ట్రంలోకి రావడానికి ఉన్న పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. సీబీఐ దర్యాప్తుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications