తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆరేళ్లలో కేంద్రం నుండి రూ.1,58,735 కోట్ల నిధులు విడుదలయ్యాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల అబద్దాలు చెప్పారని, ఇది హాస్యాస్పదం అన్నారు. తాము చెల్లించిన దాని కంటే తక్కువ తిరిగి వచ్చిందని తెలిపారు.

రూ.1.57 లక్షల కోట్లు ఏమయ్యాయి?
అయిదేళ్లలో తెలంగాణ నుండి కేంద్రానికి పన్ను ఆదాయంగా రూ.2.72 లక్షల కోట్లు చెల్లించామని, ఇందులో కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చింది కేవలం రూ.1.15లక్షల కోట్లేనని కేటీఆర్ అన్నారు. మిగతా రూ.1.57 లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణకు ఎక్కువ నిధులిచ్చామని, నిర్మల సీతారామన్ పార్లమెంటు వేదికగా చెప్పారని, ఇది బాధ కలిగించిందని కేటీఆర్ అన్నారు. ఆయన గురువారం టైమ్స్ నౌ నిర్వహించిన సమ్మిట్‌లో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల ఆర్థిక అవసరాల్ని తీర్చే బాధ్యతను కేంద్రం సమదృష్టితో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. జీఎస్టీ బకాయిల్ని తక్షణమే ఇవ్వాలన్నారు. ఇటీవలి బడ్జెట్ నిరాశపరిచిందన్నారు.

భారత్ రాష్ట్రాల సమాఖ్య
భారత్ రాష్ట్రాల సమాఖ్య అని గుర్తుంచువాలని కేటీఆర్ అన్నారు. కేంద్రం ఎన్ని విధానాలు తీసుకు వచ్చినా, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా వాటి ఆచరణ, అమలు అంతా రాష్ట్రాలోనే ఉంటుందని, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లో కూడా రాష్ట్రాల కార్యాచరణ, అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం కీలకంగా ఉంటుందని చెప్పారు.

పెద్ద నోట్ల రద్దుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నాం
2016లో చేసిన పెద్ద నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నామని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో కూడా మద్దతిచ్చామని గుర్తు చేశారు. ఈ నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిందని చెప్పారు. జీడీపీ గణనీయంగా తగ్గడానికి పెద్ద నోట్ల రద్దు కూడా కారణమని చెప్పారు.


Click it and Unblock the Notifications