TCS News: దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఈ సారి అది ఉద్యోగులకు ఆర్థిక నష్టాన్ని కలిగించింది. కంపెనీ నిర్ణయంతో టెక్కీలు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
వివరాల్లోకి వెళితే టెక్ దిగ్గజం కరోనా సమయంలో అదించిన వర్క్‌ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు గత ఏడాది ప్రకటించింది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు తప్పక ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే అటెండెన్స్ ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇతర పారామతిలతో పాటుగా దీనిని వేతన పెంపులు, వేరియబుల్ వేతనాల చెల్లింపులకు కంపెనీ పరిగణలోకి తీసుకుంటోంది. హైక్స్ విషయంలో దీనిని కంపెనీ పాటించి చూపించింది.

తాజాగా వేరియబుల్ వేతనాల చెల్లింపులకూ ఉద్యోగుల ఆఫీసు హాజరు వివరాలను కంపెనీ పరిగణలోకి తీసుకుంటోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. 60-75 హాజరు కలిగిన ఉద్యోగులు 50 శాతం వేరియబుల్ పే పొందనున్నారు. ఇదే క్రమంలో 75-85 శాతం మధ్యలో హాజరు కలిగిన టెక్కీలకు కంపెనీ 75 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించనుంది. అలాగే 85 శాతం కంటే ఎక్కువ ఆఫీసు అటెండెన్స్ కలిగిన ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే లభించనుంది. ఇక్కడ దురదృష్టకరమైన అంశం ఏమిటంటే హాజరు 60 శాతం కంటే తక్కువగా ఉన్న టెక్కీలకు వేరియబుల్ వేతనాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది.
ఈ విధాన మార్పు కొంతమంది టీసీఎస్ ఉద్యోగుల్లో ఆందోళనలను రేకెత్తించింది. సౌకర్యవంతమైన పనిని కోరుకుంటున్న కొందరు టెక్కీలు మాత్రం ఉద్యోగి ఉత్పాదకత ఆఫీసులకు రావటంపై మాత్రమే ఆధారపడి ఉండదని అంటున్నారు. టీసీఎస్ ఇప్పటికే తమ ఉద్యోగులను దేశవ్యాప్తంగా సమీప కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని, మేనేజర్ల సూచనలకు అనుగుణంగా కార్యాలయాలకు తిరిగి రావాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఉదాహరణకు ఒక టీసీఎస్ ఉద్యోగి ఏడాదికి లక్ష రూపాయలు వేరియబుల్ పే అందుకుంటున్నట్లయితే తాజా రూప్స్ ప్రకారం.. వారు పూర్తి సొమ్ము అందుకోవాలంటే రూల్స్ పాటించి 85 శాతం కంటే ఎక్కువ ఆఫీసు హాజరు కలిగి ఉండాల్సిందే. దీనికి ముందు కంపెనీ ప్రమోషన్లు, హైక్స్ విషయంలోనూ అటెండెన్స్ కీలక అంశంగా పరిగణలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పనిచేసినా పైసలు రాని పరిస్థితి టెక్కీలకు ఎదురైంది.


Click it and Unblock the Notifications